
పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. భారీగా కట్నకానుకలు తీసుకున్నాడు. పెళ్లయ్యాక భార్యతో కలిసి అమెరికాకు పయనమయ్యాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నాక తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇదే సమయంలో వారికి కుమారుడు జన్మించాడు. వారి మధ్య గొడవలు తగ్గకపోగా.. మరింత ఎక్కువయ్యాయి. భార్యాపిల్లలను స్వస్థలానికి పంపించాడు. తర్వాత మరో మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడు. ఎన్నారై పెళ్లి కొడుకు చేతిలో మోసపోయిన బాధితురాలు.. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని తుమ్మలగుంట ప్రాంతానికి చెందిన సిద్ది గనేశ్వర్ ప్రసాద్ కు 2014లో గూడూరుకు చెందిన యువతితో వివాహమైంది. పెళ్లి జరిగిన సమయంలో కేజీ బంగారం, 10 కేజీల వెండి, రూ.12 లక్షలు ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత గనేశ్వర్.. భార్యను అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడికి తీసుకెళ్లాక కొన్నాళ్లు సజావుగా ఉన్న తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు.
ఈ క్రమంలో వీరికి 2015 లో కుమారుడు జన్మించాడు. అనంతరం భార్య, బిడ్డలను అమెరికా నుంచి తిరుపతికి పంపించాడు. అప్పటి నుంచి గనేశ్వర్.. భార్య, కుమారుడిని పట్టించుకోవడం లేదు. అత్తామామలతో మాట్లాడడానికి ప్రయత్నించినా స్పందించకపోవడంతో బాధితురాలు స్థానిక దిశ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు గనేశ్వర్ కు ఫోన్ చేశారు. అయినా అతను తిరుపతి కి రాలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను తీసుకుని అపార్ట్మెంట్ కు వెళ్లింది. విషయం తెలుసుకున్న లోకయ్య నాయుడు, పద్మజ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 21 న అమెరికాలో మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు బందువుల ద్వారా బాధితురాలికి సమాచారం అందింది. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుటోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి