Telangana: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని.. గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని ఎందరో మహనీయులు గ్రామాల గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కానీ నేటి సమాజంలో పట్టణాల కంటే గ్రామాల్లో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్నేళ్ల కిందట ప్రతి గ్రామంలో గ్రామస్తులందరూ ఏకమై ప్రభుత్వం చేసే అభివద్ధితోపాటు తమ గ్రామాలను తామే మరింత అభివృద్ధి దిశగా నడిపించుకోవాలనే ఉద్దేశంతో గ్రామాభివద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లోనే కాకుండా గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకునేవారు. కానీ ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
ఈ మధ్య కాలంలో గ్రామాబివృద్ధి కమీటిలు సమాంతర సర్కార్ లుగా మారుతున్నాయి. తాము చేప్పిందే వేదం లేకుంటే ఫలితం అనుభవించాల్సిందే అంటూ జనాలను పీల్చుకుతింటున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తుండగా.. తాజాగా నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో మరో దారుణం వెలుగు చూసింది. వీడీసీల అరాచకానికి తట్టుకోలేక.. ఓ రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. అతనికి ప్రాణాపాయం తప్పింది.
ఈ అరాచకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడ్తాల్ గ్రామంలో భూ వివాదం విషయంలో ఓ రైతుకు రూ. 6 లక్షల 50 వేలు జరిమానా విధించింది వీడీసీ. అయితే, వీడీసీ నిర్ణయంతో అవమానం భరించలేక రైతు వడ్యాల పోశెట్టి(45) పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో నిజామాబాద్ జిల్లాలోనూ వీడీసీల ఆగడాలకు సంబంధించి వార్తలు వచ్చాయి. కూలీ పెంచమని అడిగినందుకు 70 దళిత కుటుంబాలను బహిష్కరించినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి.
Also read:
Maharashtra: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్క రోజులో 18 చిన్నారులకు సోకిన మహమ్మారి..
Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. పేలిన సిలిండర్.. 17 మందికి తీవ్ర గాయాలు..