Murder: మరో మలుపు తిరిగిన శివకుమార్‌ మృతి కేసు.. ఫోన్ చేసినవారిపైనే అనుమానాలు..

| Edited By: Ravi Kiran

Jun 27, 2022 | 12:14 PM

Nandyala: పెళ్లైన తర్వాత రోజే పెళ్లికొడుకు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శివకుమార్‌ది హత్యేనంటూ ఆయన బంధువుల ఆరోపించారు. బోయరేవులబ్రిడ్జి దగ్గర రక్తపుమరకలు..

Murder: మరో మలుపు తిరిగిన శివకుమార్‌ మృతి కేసు.. ఫోన్ చేసినవారిపైనే అనుమానాలు..
Shiva Kumar
Follow us on

నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో నవవరుడు శివకుమార్‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. పెళ్లైన తర్వాత రోజే పెళ్లికొడుకు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శివకుమార్‌ది హత్యేనంటూ ఆయన బంధువుల ఆరోపించారు. బోయరేవులబ్రిడ్జి దగ్గర రక్తపుమరకలు, రాళ్లు గుర్తించారు. హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన రోజు రాత్రి వరుడి సెల్‌ఫోన్‌కు కాల్‌ చేసిన వ్యక్తులే హత్య చేశారంటున్నారు శివకుమార్ బంధువులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, పరిసరాలను పరిశీలిస్తున్నారు. పెళ్లి రోజు ఎంతో ఆనందంగా గడిపిన శివకుమార్, తెల్లారే విగతజీవిగా కనిపించాడు. అర్థరాత్రి వరకు డీజే డాన్స్‌లో పాల్గొన్న శివకుమార్ తెల్లవారేసరికి మృతి చెంది కనిపించాడు. నవ వరుడు ఎలా మృతిచెందాడు అనేది మిస్టరీగా మారింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అతని మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ యాక్సిడెంట్‌లోనే చనిపోయారా? లేక అతని బంధువులు ఆరోపిస్తున్నట్టు ఎవరైనా హత్య చేశారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ హత్య అయితే, అతన్నచంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ ఘటనకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్‌కు జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శివకుమార్‌ కోసం వెతకడం మొదలు పెట్టారు. బోయరేవుల – మోత్కూరు గ్రామాల మధ్య రోడ్డుపై శివకుమార్‌ పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. కదలకుండా పడివుండటంతో అతడిని హుటాహుటిన ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. శివకుమార్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన గంటల వ్యవధిలోనే నవవరుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

క్రైమ్ వార్తల కోసం