పాపం పసివాడు.. అడవుల్లో తప్పిపోయాడు. నాన్న వెంట వడివడిగా అడుగులేస్తూ చెట్టూ పుట్టలెంటా వెళ్లిపోయాడు. అడవిలో గొర్రెలను మేపేందుకు ముందుగానే వెళ్లిపోయిన తండ్రి… బిడ్డ వెనుక వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. కాసేపటి తర్వాత తేరుకున్న తండ్రికి కొడుకు కనిపించకుండా పోవడంతో కంగారుపడి పడ్డాడు. ఆ తర్వాత అంతా వెతికాడు. గాలించినా ఫలితం లేకుండా పోవడంతో.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. పిల్లాడి మిస్సింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. వారం రోజులు అవుతోంది. ఇప్పటి వరకు కూడా ఆ చంటిబిడ్డడి ఆచూకీ దొరకలేదు. అడవి మొత్తాన్ని గాలిస్తున్నా.. చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది.
నెల్లూరు జిల్లా ఉయ్యాలపల్లిలో ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి కన్నవాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. మూడేళ్ల చిన్నారి సంజు కోసం వెతకని చోటు లేదు. గాలించని ప్రాంతం లేదు. తన బిడ్డ జాడ తొందరగా కనిపెట్టాలని బాలుడి తల్లి వరలక్ష్మి వేడుకుంటోంది. సంజు ఇప్పుడెక్కడ ఉన్నాడు? అడవిలో నడుచుకుంటూ అలసిపోయి ఎక్కడైనా పడిపోయాడా? తినడానికి తిండిలేక తాగడానికి నీళ్లు లేక నీరసించిపోయాడా? ఇంతకు ఏమై ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు. పోలీసులు మాత్రం వీలైనంత త్వరగా బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
సంజు కోసం అడవిలో కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఏడురోజులుగా పోలీసులు కూడా విస్తృతంగా గాలిస్తున్నారు. ఓవైపు డాగ్ స్క్వాడ్‌లు.. మరోవైపు డ్రోన్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయినా ఎక్కడా చిన్న క్లూ కూడా లభించకపోవడం.. నెల్లూరు పోలీసులకు ఛాలెంజింగ్‌గా మారింది.
ఒకటి రెండు రోజులకే ఆకలిని తట్టుకోలేము. అలాంటిది ఆ బాలుడు ఎలా ఉన్నాడో.. ఎక్కడ ఉన్నాడో తెలియక.. బరువెక్కిన గుండెతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కనీసం అలికిడి కూడా లేకుండా పోవడంతో.. వారి వేదన అరణ్యరోదనగా మారింది.
అయితే ఆ రోజు సంజు.. ఏడ్చుకుంటూ వెళ్లడాన్ని ఓ వ్యక్తి చూశాడు. కానీ తండ్రి వెంట అప్పుడప్పుడు వస్తుంటాడు కాబట్టి.. అలాగే వచ్చి ఉంటాడులే అనుకున్నాడు. కానీ ఆ బిడ్డ తప్పిపోయిన విషయం తర్వాత కానీ తెలియలేదని అతను కూడా చెబుతున్నాడు.