Medak Police Enthusiasm: పోలీసుల అత్యుత్సాహం ఓ నిండు గర్భిణీకి ప్రాణాల మీదకు తెచ్చినంత పనైంది. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ డెలివరి కోసం వెళ్తున్న మహిళ కారుకు ఆపారు పోలీసులు. అత్యవసరం కోసం వెళ్తున్న కారును 40 నిమిషాలు పాటు రహదరిపైనే నిలిపివేశారు. ఆ మహిళ పడుతున్న వేధనను సైతం లెక్కచేయకుండా పైశాచికానందం పొందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లదుర్గంలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ చెందిన శిల్ప అనే మహిళకు నెలలు నిండటంతో ప్రసవం కోసం ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు కుటుంబసభ్యులు. నారాయణఖేడ్ నుండి మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి గర్భవతి యువతిని డెలివరి కోసం తీసుకువస్తున్నారు. మార్గ మధ్యలో అల్లదుర్గం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని పోలీసులు కార్ డ్రైవర్‌కు సూచించారు. తన వద్ద క్యాష్ లేదని ఆన్లైన్ పేమెంట్ చేస్తానని డ్రైవర్‌తో పాటు గర్భిణీ కుటుంబసభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు పట్టించుకోలేదు. డబ్బులు కడితేనే ఇక్కడి నుంచి కదలంటూ హుకుం జారీ చేశారు.
ఇక, చేసేదేమీలేక, గర్బిణీ కుటుంబసభ్యులు చలాన్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయితే, నెట్‌వర్క్ ప్రాబ్లమ్ కారణంగా చలాన్ పేమెంట్ కోసం దాదాపు 40 నిమిషాల పాటు మొరహించింది. దీంతో 40 నిమిషాల పాటు రహదారి పైనే ఆ కారును పోలీసులు నిలిపివేశారు. నిండు గర్బిణీ అయిన శిల్ప వేధనతో తల్లడిల్లుతూనే ఉండాల్సి వచ్చింది. కాగా, ఈ 40 నిమిషాల్లో ఆ గర్భవతికి ఏమైనా జరగరానిది జరిగుంటే పరిస్థితి ఏమిటంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ రిపోర్ట్ చూపించమని పోలీసులు అడగలేదని, వారుకూడా చూపలేదని డ్రైవర్ తెలిపారు. చివరికి 40 నిమిషాలు దాటినా తర్వాత కూడా నెట్‌వర్క్ రాకపోవడంతో పోలీసులు వాహనాన్ని వదిలిపెట్టారు. కాగా, అల్లదుర్గం పోలీసుల తీరును చూసి స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతుండటం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలావుంటే, గతంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెప్పిన వెంటనే వాహనం ఆపలేదన్న కోపంతో డ్రైవర్‌ను చితకబాదారు. దీంతో బాధితుడు రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. వాహనాన్ని ఆపలేదన్న ఆక్రోశంతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని వేడుకుంటున్నా పట్టించుకోకుండా బూటు కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్నారు. ఈ తతంగాన్ని వాహనదారులు వీడియో తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also… Ek Number News LIVE:గులాబ్ గుబుల్లో వానలకోసం పూజలు, కుక్క నెత్తి పగులగొట్టిన కోతి.. లైవ్ వీడియో