డ్రగ్స్ దందా కలవరపెడుతోంది. మత్తు పదార్థాలను దేశంలోకి తెచ్చేందుకు అక్రమార్కులు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా 1.3 కేజీల కొకైన్ ప్యాకెట్లను పొట్టలో దాచుకుని తరలిస్తున్న ఆఫ్రికా దేశస్థుడు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డాడు. అతను దుబాయ్ నుంచి వచ్చాడు. విమానంలో ఇచ్చిన ఆహారాన్ని, నీటిని అతడు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు.. అతడిని స్కాన్ చేయగా పొట్టలో కొకైన్ పదార్థం ఉన్నట్లు గుర్తించి.. అరెస్ట్ చేశారు. డాక్టర్ల సహాయంతో కొకైన్‌ను బయటకు తీశారు. పట్టుబడ్డ 1.3 కిలోల కొకైన్ విలువ రూ.11 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. నిందితుడిని బెంగళూరుకు పంపించాడు. అతడికి ఓ లగ్జరీ హోటల్లో గది బుక్ చేశాడని.. అధికారుల విచారణలో తేలింది. అక్కడ నుంచి పంపిన వ్యక్తి ఎవరు, అది ఎవరికి సప్లై చేయడానికి వచ్చాడు అనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. నిందితుడు తొలుత నేరాన్ని ఒప్పుకోలేదు. తర్వాత కడుపులో ఇబ్బందిగా ఉండటంతో పోలీసులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడు.
నిందితుడి వయసు 30 ఏళ్లు ఉంటుందని, బెంగళూరులో కిడ్నీ చికిత్స కోసం వస్తున్నట్టు వీసాను కూడా వైద్యం కోసం తీసుకున్నాడని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు వివరించారు. మంగళవారం రాత్రి అతడి అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కి తరలించామని, స్కాన్ చేయడంతో క్యాప్సుల్స్ విషయం బయటపడిందన్నారు. శుక్రవారం సాయంత్రం ఆపరేషన్ నిర్వహించి వాటిని బయటకు తీసినట్టు డీఆర్ఐ అధికారి పేర్కొన్నారు.
ఇటీవల ముంబైలో కూడా ఇదే ఫార్మాట్‌లో
ఇటీవల తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డాడు. రూ.10 కోట్ల విలువ చేసే 1.02 కేజీల కొకైన్ ఇతని వద్ద పట్టుబడింది. నిందితుడు ఫ్యూమో ఇమాన్యుయేల్ జెడెక్వియాస్ ఈ మత్తు పదార్థాన్ని క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచుకొన్నట్టు మాదకద్రవ్యాల నిరోధక విభాగం తెలిపింది. కొకైన్‌తో నింపిన 70 క్యాప్సుల్స్ ఇతడు మింగినట్లు విచారణలో తెలిసింది. వెంటనే అతణ్ని బైకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పలుమార్లు ప్రయత్నించి కొకైన్ క్యాప్సూళ్లను వెలికితీశారు. అది దక్షిణ అమెరికాకు చెందిన కొకైన్‌గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఏపీ, తెలంగాణ లీడర్స్.. ఫోటోలు