హైదరాబాద్ పంజాగుట్టలో ఘోరం జరిగింది. నాగార్జునహిల్స్ సర్కిల్ దగ్గర రోడ్డు పై వెళుతున్న రియాసత్ అలీ అనే వ్యక్తి పై ఐదుగురు దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జూన్ 27న జరిగిన సయ్యద్ అన్వర్ హత్యకేసులో రియాసత్ అలీ ప్రధాన నిందితుడు. ఆ కేసులో జైలుకు వెళ్లిన అలీ ఐదురోజుల క్రితమే విడుదలయ్యాడు. టీ తాగేందుకు రోడ్డు పైకి వచ్చిన అలీపై కత్తులతో దాడి చేసి చంపేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సయ్యద్ అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు నడిరోడ్డుపై దుండగులు కత్తులతో దాడి చేయడంతో స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో హత్య జరగడం తీవ్ర కలకలం రూపుతోంది.