సిద్ధిపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కంది చేనులో ఇనుప చువ్వలతో తలపై బాది హతమార్చారు. తల ఛిద్రమై.. హత్యకు గురైన వ్యక్తి మృతదేహం కొండపాక మండలం దుద్దెడ శివారు రాంపల్లి రహదారి పక్కన కంది చేనులో బుధవారం కనిపించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్దెడకు చెందిన మేక శ్రీనివాస్(42) పన్నెండేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమారులతో సిద్దిపేటకు మకాం మార్చి ప్రైవేటు కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మేక శ్రీనివాస్ సిద్దిపేటలోని తన ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు.. రాత్రి 9 తర్వాత అతడికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. బుధవారం ఉదయం కొందరు వ్యక్తులు కంది చేనులో మద్యం తాగడానికి వెళ్లగా, రక్తసిక్తమైన శ్రీనివాస్ మృతదేహన్ని గుర్తించారు. గ్రామస్థుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జాగిలాలు, ఆధారాల సేకరణ బృందం వివరాలు సేకరించాయి. విచారణలో సిద్దిపేటకు చెందిన ముస్త్యాల శ్రీనివాస్‌పై అనుమానాలు వ్యక్తం అవ్వడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు చెప్పారు. ఈ హత్యలో కుటుంబీకుల ప్రమేయం కూడా ఉండొచ్చనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.