కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కొడుకును చంపుతానంటున్నాడు. నీడలా.. అండగా నిలబడాల్సిన నాన్నే.. నువ్వు నాకు అక్కర్లేదంటున్నాడు. మూడేళ్ల పసివాడిపై.. కనీసం జాలి కూడా చూపించకుండా.. విషం తినిపిస్తా అంటూ హిరణ్యకశిపుని అవతారం ఎత్తాడు. అభం.. శుభం తెలియని ఆ చిన్నారిని తల్లికి దక్కకుండా చేసేందుకు కుట్ర పన్నాడు. గద్దలు ఎత్తుకు పోతాయ్ ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దని చిన్నపిల్లలను భయపెట్టడానికి ఊరికే సరదాగా చెప్తారు. కానీ ఆ గద్ద.. కన్న తండ్రే అవుతారని ఎవరూ అనుకోరు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన విన్న తర్వాత.. నువ్వసలు తండ్రివేనా అంటూ ఆ ప్రబుద్ధుడిని తిట్టక మానరు.
పొన్నలూరు మండలం చెరువుకొమ్ము పాలెం గ్రామనికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఉమతో వివాహం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోం కావడంతో.. ఇంటి దగ్గర నుంచే డ్యూటీ చేస్తున్నాడు. మద్యానికి, ఆన్ లైన్ జూదానికి, గుర్రం పందేలకు అలవాటు పడి 20 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులోళ్లు ఒత్తిడి చేయడంతో.. డబ్బుల కోసం భార్య ఉమను వేధించడం మొదలుపెట్టాడు. డబ్బులు తీసుకొని రాకపోతే.. ఉమతో పాటు బిడ్డను చంపుతానని బెదిరించటం మొదలు పెట్టాడు రామకృష్ణారెడ్డి. మూడురోజుల్లో డబ్బులు తేవాలని లేనిపక్షంలో.. మీకు విషం పెట్టి నేనూ చచ్చిపోతానంటూ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు.
తీవ్రభయాందోళనకు గురైన ఉమ.. విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తన కొడుకు శర్వాన్ రెడ్డిని తీసుకుని.. రామకృష్ణారెడ్డి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి గడచిపోయినప్పటికీ బిడ్డను తీసుకుని రాలేదు. భార్య ఉమకు ఫోన్ చేసి.. 20లక్షల రూపాయలు ఇస్తేనే బిడ్డను ఇస్తానని లేదంటే చంపేస్తాంటూ బెదిరింపులకు దిగాడు. భర్త తీరుతో తీవ్ర ఆందోళనకు గురైన ఉమ.. పొన్నలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన అధికారులు.. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కందుకూరు లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. లాడ్జిలో మద్యం మత్తులో ఉన్న రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకొని బిడ్డను తల్లికి అప్పగించారు. రామకృష్ణారెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు డీఎస్పీ శ్రీనివాసులు.
రామకృష్ణారెడ్డి వ్యసనాలకు బానిసై, కన్నబిడ్డను డబ్బు కోసం చంపటానికి కిడ్నాప్ కు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి రామకృష్ణారెడ్డి నుంచి బిడ్డను కాపాడారని.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad : గుండ్లపోచంపల్లిలో దొంగల బీభత్సం.. గ్యాంగ్ అంతా దిగిపోయింది