Kurnool CI corruption: బరితెగించిన కర్నూలు సీఐ.. ఎస్పీ పేరుతో రూ.15 లక్షలు హాంఫట్‌.. గుట్టు రట్టవడంతో…

|

Mar 25, 2022 | 9:47 AM

ఖాకీల కరప్షన్‌ హద్దులు దాటుతోంది. లంచగొండితనమే కాదు.. పట్టుబడ్డ సొమ్మునూ హాంఫట్‌ చేసేస్తున్నారు ఖాకీలు. అక్రమ సొమ్ముతో కోట్లకు పడగలెత్తుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు కర్నూలు జిల్లా పోలీసులు.

Kurnool CI corruption: బరితెగించిన కర్నూలు సీఐ.. ఎస్పీ పేరుతో రూ.15 లక్షలు హాంఫట్‌.. గుట్టు రట్టవడంతో...
Kurnool Ci
Follow us on

Kurnool CI miss used Power: ఖాకీల కరప్షన్‌ హద్దులు దాటుతోంది. లంచగొండితనమే కాదు.. పట్టుబడ్డ సొమ్మునూ హాంఫట్‌ చేసేస్తున్నారు ఖాకీలు. అక్రమ సొమ్ముతో కోట్లకు పడగలెత్తుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు కర్నూలు జిల్లా(Kurnool District) పోలీసులు(Police). ఓ సీఐ అవినీతి బాగోతం లేటెస్ట్‌గా బట్టబయలైంది. కర్నూలు సీఐ బరితెగించారు. ఏకంగా ఎస్పీ పేరు చెప్పి అప్పనంగా లక్షలు కొట్టేశాడు. తీరా గుట్టురట్టవడంతో పత్తాలేకుండా పోయాడు.

కర్నూలు శివార్లలోని పంచలింగాల చెక్‌పోస్ట్‌ దగ్గర ఈనెల 19న భారీగా నగదు పట్టుబడింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో హైదరాబాద్ టు తమిళనాడుకు 75 లక్షలు తీసుకెళ్తున్న బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు SEB అధికారులు. నగదుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఓ పద్ధతి ప్రకారం కేసును తాలూకా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఇక ఇక్కడే మొదలైంది అసలు డ్రామా. సీన్‌లోకి వచ్చిన.. తాలూకా సీఐ కంబగిరి రాముడు అత్యాశకు పోయాడు. రెండు రోజులు ఆగి అన్ని రశీదులూ తీసుకొచ్చిన బాలకృష్ణ.. డబ్బు తిరిగివ్వాలని సీఐని కోరాడు. డబ్బు తిరిగిచ్చేందుకు నిరాకరించిన సీఐ రాముడు.. మరిన్ని ప్రూప్స్‌ కావాలని పట్టుబట్టాడు. అంతేకాకుండా కొంత నగదును ఎస్పీకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

పట్టుబడ్డ 75 లక్షల్లో బాలకృష్ణకు కేవలం 60 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నాడు సీఐ. మిగతా 15 లక్షలు నొక్కేశాడు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు రంగు బయటపడింది. దీనిపై ఎస్పీ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించారు. డబ్బు తీసుకుంది నిజమేనని తేలడంతో సీఐ కంబగిరి రాముడుపై కేసు నమోదైంది. విషయం తెలుసుకున్న సీఐ.. పరారయ్యాడు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఇదే కంబగిరి రాముడు నంద్యాలలో పనిచేసి సస్పెండయ్యారు. డోన్‌లో పనిచేస్తున్న సమయంలోనూ ఆరోపణలున్నాయి.

ఇదిలావుంటే, దీనిపైనా జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న సీఐ విజయవాడకు పరారైనట్లు తెలుస్తోంది. సీఐని పట్టుకునేందుకు రెండు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో కూడా SEB అధికారులు డబ్బులు పట్టుకున్న ఘటనలో ముడుపులు తీసుకుని వదిలేసినట్లు ఆరోపణలున్నాయి.

Read Also…  AP Crime: కానిస్టేబుల్ ఉద్యోగం పోగొట్టుకున్నాడు.. గంజాయి స్మగ్లర్ గా మారాడు.. చివరికి