Kolkata Shootout: పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ జైపాల్ సింగ్ భుల్లర్, అతని సహచరుడు జస్ప్రిత్ సింగ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. లుథియానాలో ఇటీవల ఇద్దరు పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లపై కాల్పులు జరిపి చంపినట్లు వీరిద్దరిపై అభియోగాలున్నాయి. దీంతోపాటు పలు రాష్ట్రాల్లో కేసులు మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమంగా ఆయుధాల రవాణా వంటి కేసులు నమోదయి ఉన్నాయి. ఈ క్రమంలో పంజాబ్ నుంచి పారిపోయి వచ్చి కోల్‌కతాలో ఉన్నరన్న సమాచారం మేరకు బుధవారం పంజాబ్ పోలీసులు, బెంగాల్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. కోల్‌కతా న్యూటౌన్ లోని పలాంజీ నివాస సముదాయం వద్ద జైపాల్ సింగ్ భుల్లర్, జస్ప్రిత్ సింగ్ ఉన్నారని పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు మరణించారని పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు.
జస్ప్రీత్, జైపాల్‌ను అరెస్టు చేయాలని ప్రయత్నించినప్పటికీ వారు తమపై కాల్పులు జరపారని పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ వీకే గోయల్ పేర్కొన్నారు. ప్రతిగా తాము జరిపిన ఎదురుకాల్పుల్లోవారు మరణించారన్నారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు గాయలయ్యాయి. ఈ ఘటన అనంతరం వారి వద్ద నుంచి రూ.7 లక్షల నగదు, 5 ఆయుధాలు, 89 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కాగా.. జైపాల్ భుల్లర్, జస్ప్రీత్ సింగ్ పేరు మోసిన డ్రగ్ స్మగ్లర్లు. వారిపై తలా రూ.10 లక్షలు, రూ.5 లక్షల రివార్డు ఉందని పంజాబ్ డీజీపీ తెలిపారు. జైపాల్‌పై 25 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. గత నెల 15న లుధియానాలోని జగ్రాన్‌లో హత్యకు గురైన పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు భగవాన్ సింగ్, దల్విందర్‌జిత్ సింగ్ కేసులో ఇతను ప్రధాన నిందితుడని పేర్కొన్నారు.
Also Read: