ప్రేమ పేరుతో వంచించే మోసగాళ్లు తరచూ కనిపిస్తూనే ఉన్నారు. చేతిలో చేయి వేసి.. జీవితం నీకే అంకితమంటూ నమ్మకాన్ని కలిగించి.. చివరికి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ… తిరువనంతపురం జిల్లాలోని అంబూరీలో ఆలస్యంగా వెలుగుచూసింది.
అఖిల్ ఆర్. నాయర్ అనే వ్యక్తి ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి కొచ్చిలో ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న రఖిమోల్ అనే యువతితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది. అప్పటినుంచి ఇద్దరు హద్దులులేకుండా తిరిగారు. పెళ్లికాకుండానే రహస్యంగా సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. ఇంతలో నాయర్ తనకు ఇంట్లో పెళ్లిసంబంధాలు చూస్తున్నారని.. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా రఖిమోల్‌తో చెప్పాడు. ఈ వార్తతో తీవ్రంగా కుంగియిన రఖిమోల్ .. నాయర్ తనను పెళ్లి చేసుకుని జీవితాన్ని ఇస్తాడనుకున్న రఖిమోల్ మోసపోతున్నట్టుగా గ్రహించింది. దీంతో నాయర్ పెళ్లి చేసుకోబోతున్న యువతి వద్దకు వెళ్లి అసలు విషయం చెప్పింది. దీనివల్ల నాయర్ పెళ్లి సంబంధం రద్దయిపోయింది. నాయర్ ఉద్దేశం ప్రకారం .. ఆ యువతిని పెళ్లిచేసుకుని, రఖిమోల్‌తో రహస్య బంధాన్ని కొనసాగించాలనుకున్నాడు. అయితే అతడి పాచిక పారలేదు. దీంతో కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు చూపిస్తానని చెప్పి ఆమెను తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. రఖిమోల్‌ను హత్య చేయడానికి నాయర్‌కు కొంతమంది స్నేహితులు కూడా సహకరించారు. అతడి ఇంటి వెనుక ముందుగానే సిద్ధం చేసుకున్న 6 అడుగుల గొయ్యిలో రఖిమోల్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
అయితే తన కుమార్తె కొన్ని రోజులుగా కనిపించడం లేదని రఖిమోల్ తల్లిదండ్రులు నెలరోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు నాయర్‌ను కూడా ప్రశ్నించారు. అయితే తనకు రఖిమోల్ అంటే ఇష్టమని.. ఎలాగైనా వెతికిపెట్టాలని దొంగ ఏడ్పులు కూడా ఏడ్చాడు.కేసు పరిశోధనలో భాగంగా పోలీసులు నాయర్, అతని స్నేహితుల రెండు నెలల ఫోన్ కాల్‌డేటాను పోలీసులు పరిశీలించారు. ఈ విచారణలో ఎక్కడో అనుమానమొచ్చింది. దీంతో వారు నాయర్ ఇద్దరు స్నేహితుల్ని పట్టుకుని తమ స్టైల్‌లో అడిగేసరికి అసలు విషయం బయటికొచ్చింది.రఖిమోల్‌ను నాయర్ చంపేశాడని, తాము సహకరించినట్టుగా చెప్పారు. ఆమె శవాన్ని నిర్మాణంలో ఉన్న నాయర్ బిల్డింగ్ వెనుకవైపున పూడ్చినట్టుగా చెప్పేశారు.
దృశ్యం సినిమా స్టోరీకి దగ్గరగా ఉన్న ఈ రియల్‌స్టోరీ విన్న పోలీసులు అవాక్కయ్యారు. అయితే ఎప్పటికైన ఇంటికి తిరిగి వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులకు కుళ్లిపోయిన స్థితిలో తమ కుమార్తె మృతదేహం కనిపిస్తుందని అస్సలు ఊహించలేకపోయారు. ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా.. ఏకంగా ప్రాణాలుసైతం తీసేసిన ఆర్మీ జవాన్ నాయర్‌ను కఠినంగా శిక్షించాలని రఖిమోల్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.