Lakshman Naik IPS Suspension: వివాదాలే కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలుగు ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్‌పై కేరళ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించి జనాన్ని మోసం చేసి మోన్సన్ మవుల్‌కల్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో కేరళ ప్రభుత్వంలక్ష్మణ్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిత్యం వివాదాల్లో ఉండే తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్‌ను సస్పెండ్ చేసింది కేరళ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్.. కేరళలో ఐజీగా విధులు నిర్వహిన్నారు. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో లక్ష్మణ్‌ను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోసపూరిత కార్యకలాపాలలో మోన్సన్‌కు సహాయం చేయడానికి తన పదవిని ఉపయోగించారనే ఆరోపణలపై హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలావుంటే, పురాతన వస్తువుల వ్యాపారిగా మాయమాటలు చెప్పి ప్రజల నుండి కోట్లాది రూపాయలను మోసం చేసినందుకు మోన్సన్ సెప్టెంబర్‌లో అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలోనే మోన్సన్ మవున్‌కల్‌కి కేరళ మాజీ పోలీసు చీఫ్ డీజీపీ లోక్‌నాథ్ బెహెరా, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ చీఫ్ డీజీపీ అనిల్‌కాంత్‌తో సహా రాష్ట్రంలోని అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులతో సంబంధం ఉన్నట్లు కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. లక్ష్మణ్ నాయక్‌తో ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఆరోపణలపై ఐజీ లక్ష్మణ్‌పై చర్యలకు పోలీసు ప్రధాన కార్యాలయం సిఫారసు చేసింది. 1997 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిపై శాఖాపరమైన చర్యలకు ఓకే చెబుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫైల్‌పై సంతకం చేశారు.
గతంలో కూడా చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు లక్ష్మణ్ నాయక్. త్వరలో రాజకీయాల్లోకి వస్తునట్టు, తెలంగాణలో మంత్రి పదవిని చేపట్టబోతునట్టు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన విద్యార్ధి నేతలను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించిన ఆడియో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్ష్మణ్ నాయక్ ఖమ్మం జిల్లా వాసి. అలపుజా ఏఎస్పీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతం, క్రైమ్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో సేవలందించారు. అంతేకాదు బీఎస్‌ఈ, ఎస్‌ఎమ్‌ఈ సీఈఓగా నాలుగేళ్ల పాటు సేవలందించారు. లక్ష్మణ్ ఉమ్మడి ఏపీ డీజీపీగా పనిచేసిన డీటీ నాయక్ కుమార్తె డాక్టర్ కవితను వివాహం చేసుకున్నారు.
Read Also…. Inspiring Person: చిన్నారుల్లో చిరునవ్వు కోసం ఉచితంగా 37 వేల ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు చేసిన డాక్టర్..