IT raids Tamil Nadu polls: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడుల దడ పుట్టిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా.. దాడులతో కాక పుట్టిస్తోంది ఐటీ శాఖ. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ తనిఖీలు ముమ్మరం చేసింది. ఐటీ అధికారుల సోదాల్లో కట్టలకు కట్టల నోట్లు బయటపడుతున్నాయి. కోట్లాది రూపాయల సొమ్ము పట్టుబడుతోంది. తాజాగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కుమార్తె సేంతామరై ఇంటిపై దాడులు చేశారు ఐటీ అధికారులు. చెన్నై శివారులోని నీలాంగరైలో స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంటితో పాటు.. కార్యాలయాల్లోనూ మొత్తం నాలుగు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఐతే ఈ దాడులకు భయపడేది లేదంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. తను కరుణానిధి కొడుకునంటూ గుర్తు చేశారు. తిరుచ్చిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్టాలిన్..ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ నాటకాలాడుతోందని విమర్శించారు.
ఐటీ దాడుల తరువాత డీఎంకే కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు స్టాలిన్. కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. దమ్ముంటే తన నివాసంలో ఐటీ శాఖ దాడులు చేయాలని సవాల్ విసిరారు డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్. అన్నాడీఎంకే నేతల ఒత్తిళ్ల తోనే ఐటీ శాఖ దాడులు చేస్తోందని ఆరోపించారు. డీఎంకేలో ఎక్కువ ఆస్తులు ప్రకటించిన పార్టీ అభ్యర్ధి ఏకే మోహన్ నివాసంపై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. రూ.170 కోట్ల ఆస్తులను ప్రకటించారు మోహన్. ఐటీ దాడులు జరుగుతున్నప్పటికి అన్నానగర్‌లో తాపీగా ప్రచారం నిర్వహించారు మోహన్.
ఇటీవలే పలువురు డీఎంకే, అన్నాడీఎంకే, కమల్‌హాసన్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. ఈ దాడుల్లో వందల కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3వందల కోట్ల రూపాయల వరకు మనీ పట్టుబడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఐటీ కన్ను..తమిళనాడుపై పడింది. అన్ని పార్టీల నేతలు, వారి బంధువుల ఇళ్లపై గురిపెట్టింది. పదుల సంఖ్యలో బృందాలు ఒక్కసారిగా దాడి చేసి కోట్ల రూపాయలు పట్టుకుంటున్నారు.ఐటీ దాడులతో తమను భయపెట్టలేరని , బీజేపీ డర్టీ గేమ్స్‌ను తమిళనాడు ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని డీఎంకే నేతలన్నారు.
Read also : Etela Rajender : మనల్నిపాలించే వారికి కూడా మెరిట్ ఉండాలి, ఆ బాధ ఏదోక నాడు నీ గడప కూడా తొక్కుతుంది : ఈటల