దండకారణ్యంలో మావోయిస్టులను కరోనా వణికించింది. ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్‌కు తోడు కరోనా కాటు తీవ్ర ప్రభావం చూపించింది. తూటాల నుంచి తప్పించుకున్నారు.. ఎన్నో ఎన్ కౌంటర్లను ఎదుర్కొని.. పోలీసులకు ఛాలెంజ్ విసిరారు. అడవిలో ఉంటూనే హింసాత్మక వ్యూహాలు రచించారు. కానీ కోవిడ్ కాటు నుంచి తప్పించుకోలేకపోయారు. ఇప్పటికే కేంద్ర స్థాయి నాయకుల నుంచి కొత్తగా దళంలో చేరినవాకి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉండటం… ఇదే సమయంలో పోలీసులు నిఘా పెంచడంతో కరోనా సోకినా చికిత్స చేయించుకునేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. ఇలా చాలా అడివిలోనే ఉంటున్న మావోయిస్టులు కరోనాతో చనిపోయారు. అంతేకాదు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ సమస్యతో బాధపడుతున్న మావోయిస్టు సభ్యులు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో బడే చొక్కారావు కూడా ఉన్నట్లుగా పోలీసు ఇంటెలిజెన్స్ అంటున్నాయి.
ఇదిలావుంటే కరోనా తమను కోలుకోలేని దెబ్బ కొట్టిందని కేంద్ర స్థాయి మావోయిస్టులు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నిర్మాణ పనులపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. చనిపోయినవారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఇప్పటికే కేంద్ర కోర్ కమిటీ సభ్యులు రంగంలోకి దిగినట్లుగా సమాచారం. కరోనా దెబ్బతో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ చనిపోయిన సంగతి తెలిసిందే… అయితే అతని స్థానంలో ఆ పార్టీ ఎవరిని నియమిస్తుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విప్లవోద్యమంలో చివరి వరకు చురుకుగా పోరాడిన హరిభూషణ్ ఈనెల 21న కోవిడ్‌తో మృతి చెందాడు… అతని స్థానంను బర్థి చేసేందుకు అంతే స్థాయి ఉన్న నాయకుడి కోసం ఆ పార్టీ చూస్తోంది.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్ర కమిటీ నాయకుడు కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ గుండెపోటుతో మరణించగా, హరిభూషణ్, మహిళా నాయకురాళ్లు సమ్మక్క అలియాస్ భారతక్క, శారద కరోనాతో చనిపోయారు. హరిభూషణ్ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పోలీసు ఇంటెలిజెన్స్, మాజీ మావోయిస్టు వర్గాల్లో చర్చ మొదలైంది.
కరోనా రూపంలో పెద్ద తగలడంతో కొత్త నాయకుడి నిర్ణయంపై మావోయిస్టు పార్టీ నాయకత్వం పెద్ద మీమాంసలో పడింది. ఎవరిని ఆ స్థానంలో నియమించాలనే కోణంలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మంచి ఊహకర్తగా పేరున్న హరిభూషణ్ స్థానంలో అదే స్థాయి వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఓ రెండు పేర్లను పరిశీలిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
హరిభూషణ్ స్థానంలో రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామిని నియమించవచ్చనే చర్చ మొదలైంది. నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా స్వామి చాలాకాలం పనిచేయగా, ఆయన సహచరి లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన కూడా ఉద్యమంవైపే నడిచింది. మైదాన ప్రాంతాల నుంచి దళాలను ఎత్తివేసే సమయంలో దండకారణ్యానికి తరలివెళ్లినా.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ కమిటీని కూడా స్వామి లీడ్ చేశాడు. మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్న స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కీలక బాధ్యతల్లో ఉండగా, ఉద్యమ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం కల్పించవచ్చంటున్నారు.
1991 నుంచి పార్టీలో కీలకంగా ఉన్న కొంకటి వెంకట్ అలియాస్ రమేష్ పేరు కూడా ప్రచారంలో ఉంది. కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, ఆనుపురం కొంరయ్య అలియాస్ సుధాకర్ (ఏకే) ఎన్‌కౌంటర్ తర్వాత జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన అప్పటి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో సభ్యుడిగా పని చేశాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో కీలకంగా ఉన్న రమేష్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్ పేర్లు కూడా రాష్ట్ర కార్యదర్శి కోసం పరిశీలించవచ్చంటున్నారు.