ED Officer Lalit Bazad arrests Instant loan apps case: చైనా ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసు మరో మలుపు తిరిగింది. ప్రజలకు ఉరితాళ్లుగా మారిన మాయదారి లోన్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీస్ నిర్వహిస్తున్న బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఈ అకౌంట్లను తిరిగి తిరిచేందుకు లోన్ యాప్ మాయగాళ్ల నుంచి లంచం తీసుకున్న ఈడీ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.
అకౌంట్స్‌ను డీఫ్రీజ్ చేసందుకు ముంబయికి చెందిన అపోలో ఫైన్ వెస్ట్ ఎండీ నుంచి ఈడీ అధికారి లలిత్ బజాద్ ఐదు లక్షల రూపాయల లంచం తీసుకున్నారు. బెంగళూరులోని బ్యాంకులకు తప్పుడు పత్రాలు ఇచ్చి అకౌంట్లను తిరిగి తెరిపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులు.. సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో లలిత్ బజాద్‌ను సీబీఐ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు.
వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన మాయదారి లోన్ యాప్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు అష్ట కష్టాలు పడ్డారు. ప్రజల నుంచి అక్రమంగా కొల్లగొట్టిన సొమ్ముని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోన్ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు వాటి అకౌంట్లను సీజ్ చేశారు. ఇలాంటి కీలకమైన కేసులో ఈడీ అధికారి యాప్‌ల అక్రమార్కులకు సహకరించిన తీరు చూసి పోలీసులు షాక్ తిన్నారు.
ఇదిలావుంటే, చైనా ఆన్‌లైన్ డిజిటల్ లోన్ యాప్ కేసును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి 17 మందిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. చైనాకు చెందిన లాంబో అనే వ్యక్తి రుణ యాప్‌లను రూపొందించడంతో పాటు వాటి ద్వారా రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. లాంబోని ఒక రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. నిందితుడి సెల్‌ఫోన్, లాప్‌టాప్, ఐపాడ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
లాంబో పంపిన సందేశాలు, అతనికి వచ్చిన సందేశాలు అన్నీ చైనా భాషలోనే ఉండటంతో, ఆ భాష తెలిసిన వాళ్ల సాయం తీసుకొని దర్యాప్తు కొనసాగించారు. రుణ యాప్‌ల బండారం బయటపడిన తర్వాత తన లాప్‌టాప్ నుంచి లాంబో కీలక సమాచారం తొలగించినట్లుగా పోలీసులు గుర్తించారు. కంప్యూటర్ నిపుణుల సాయంతో లాప్‌టాప్‌లోని సమాచారాన్ని సైబర్ క్రైం పోలీసులు సేకరించారు. ఇదే క్రమంలో బెంగళూరులో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
Read Also… ఆరేళ్ళ బాలుడి మృతికి కారకుడంటూ కర్ణాటకలో డాక్టర్ పై దాడి….. నలుగురి అరెస్ట్..