
ఇండియాలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్కడే చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం చేశాడనే ఆరోపణలతో కేసు నమోదైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.
పూర్తి వివరాల్లో వెళ్తే.. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి తనను అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐఐఎం- కోల్‌కత్తా బాయ్స్ హాస్టల్‌లో ఈ సంఘటన శుక్రవారం జరిగినట్లు పోలీసు అధికారి తెలిపారు.
“కౌన్సెలింగ్ సెషన్ కోసం తనను హాస్టల్‌కు పిలిపించారు, ఆ తర్వాత నాకు ఒక కూల్‌డ్రింగ్ ఇచ్చారు, అది తాగిన తర్వాత నేను స్పృహ కోల్పోయాను. తిరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగినట్లు గ్రహించాను. తనకు ఇచ్చిన సాఫ్ట్ డ్రింగ్‌లో డ్రగ్స్ కలిపినట్లు అనిపించింది.” అంటూ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా తనను నిందితుడు బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని పోలీసులు తెలిపారు.
నిందితుడైన విద్యార్థిని అరెస్టు చేయడానికి ముందు రోజు రాత్రి అతన్ని కాలేజ్ నుంచి డిటేన్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. దీనిపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెళ్లడించారు. కోల్‌కత్తాలో కొన్ని నెలల క్రితం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో మెడికో హత్యాచారం, ఆ తర్వాత కోల్‌కతాలోని ఒక లా కాలేజీ లోపల ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాదాపు పక్షం రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో కోల్‌కతా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి