Alwal Young Woman Brutally Murdered: హైదరాబాద్ మహా నగరంలోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బీహెచ్‌ఈఎల్ కాలనీ సమీపంలో రైల్వేట్రాక్ దగ్గర యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అల్వాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సోమవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి సర్వతి(18) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదిలావుంటే మంగళవారం ఉదయం స్థానికులకు సరస్వతి డెడ్‌బాడీ రైల్వే ట్రాక్‌పై కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న కనిపించకుండాపోయిన సరస్వతిగా గుర్తించారు. దీంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే, దీపక్ అనే యువకుడిపై బాధితురాలి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేయడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరి మధ్య ప్రేమ.. ఇంత వరకు తీసుకువచ్చినట్లు అంచనా వేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం చున్నీతో సరస్వతికి ఉరి వేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో విచారించడంతో.. తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నట్లు అల్వాల్ సి.ఐ.గంగాధర్ స్పష్టం చేశారు.
ఇంటర్ ఫెయిల్ అయిన దీపక్.. పని లేకుండా తిరుగుతున్నాడు. ఇంటర్మీడియట్‌లో వీరిద్దరు కలిసి చదువుకున్నారని బంధువులు చెప్తున్నారు. ఇదే క్రమంలో పరిచయం ఉండటంతో కలిసి వెళ్లినట్లు భావిస్తున్నారు. పోలీసుల విచారణలో దీపక్ చెప్పిన వివరాల ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్.. ఆధారాలు సేకరిస్తోంది.