డ్రగ్స్.. ఈ మాట వింటే భయం పుడుతోంది. హైదరాబాద్ మహా నగరాన్ని పట్టి పీడిస్తున్న అంశాల్లో ఒకటి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. చాప కింద నీరులాగా విస్తరిస్తూ.. విస్తుపోయేలా చేస్తోంది. యువతలో మాదకద్రవ్య వినియోగం పెరిగిపోవడమే కాదు. ఇప్పుడదీ మైనర్‌ల వద్దకు సైతం చేరి ఆందోళన కలిగిస్తోంది. విశ్వనగరం రోజు రోజుకు డ్రగ్ మాఫియా వింత పుంతలు తొక్కుతోంది. ఎవరికీ డౌట్ రాకుండా ఫుడ్ సప్లయ్ తరహాలో డ్రగ్ డోర్ డెలవరీ చేసే స్థాయికి ఎదిగింది.
హైదరాబాద్ మహా నగరంలో 2023 జూన్ 01 నుంచి డిసెంబర్31 వరకు కేవలం గంజాయికి సంబంధించి 30 కేసుల్లో 84 మంది అరెస్ట్ అయ్యారు. అందులో భాగంగా దాదాపుగా 4కోట్ల 13 లక్షలు విలువచేసే 19,035 కిలోల నిషేధ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి మొత్తంగా 182 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేస్తోంది. మరి వీటికి కారణం ఏంటి.? ఎందుకు అంటే మాత్రం పలు కారణాలు కనిపిస్తున్నాయి. పెంపకంలో లోపాలు, ఒత్తిడి వల్ల మైనర్లు కూడా సిగరెట్లు సహా మాదక ద్రవ్యాల వినియోగానికి పాల్పడుతున్నారని మానసిక నిపుణులు అంటున్నారు.
మాదక ద్రవ్యాలు, ఈ-సిగరేట్ వినియోగానికి సంబంధించి 2021తో పోలిస్తే 900 కేసులు పెరిగి, 2022లో 2,498 కేసులు మైనర్లపై నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. అది 2023లో 28 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాంతో పాటుగా టీఎస్ న్యాబ్ నగరంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనార్థాల గురించి 28 అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అందులో దాదాపుగా 8,100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. మరోవైపు డ్రగ్స్ వినియోగదారుల్లో 536 మందిని రీ హాబిటేషన్ సెంటర్లకు పంపించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే వీటి వాడకం వల్ల మెదడు చురుకుదనం తగ్గడం, శారీరకంగా క్షీణించిపోవడం, ప్రాణాంతకానికి సైతం దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గంజాయితో పాటు 2023 చివరి ఆరునెలల్లో హాష్ అయిల్ వినియోగం కూడా జరిగింది. 3 కేసులు నమోదైనట్లు తెలిపింది. వీటన్నింటికి ప్రత్యామ్నాయం అంటే తల్లిదండ్రులు నిత్యం పిల్లల కదలికలపై దృష్టి సారించడం, మాదకద్రవ్యాల వల్ల కలిగే పర్యవసానాలను పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలని అధికారులు చెబుతున్నారు. సమాన వయసు కంటే ఎక్కువ తల్లిదండ్రులతో ఇలాంటి విషయాలు పంచుకోవాలని మైనర్లకు సూచిస్తున్నారు అధికారులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…