Telugu Academy: తెలుగు అకాడమీలో కాసుల కుంభకోణం..డిసెంబర్‌కు టార్గెట్.. జనవరిలో స్టార్ట్‌.. 10మంది అరెస్ట్ః సీపీ

|

Oct 06, 2021 | 2:51 PM

తెలుగు భాషను ఉద్దరించేందుకు పెట్టిన సంస్థ. స్వయం ప్రతిపత్తి కూడా ఉంది. ఒకప్పుడు అతిరథ మహారథులు బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటిచోట పందికొక్కులు చేరాయి.

Telugu Academy: తెలుగు అకాడమీలో కాసుల కుంభకోణం..డిసెంబర్‌కు టార్గెట్.. జనవరిలో స్టార్ట్‌.. 10మంది అరెస్ట్ః సీపీ
Telugu Academy
Follow us on

Telugu Academy Scam: తెలుగు భాషను ఉద్దరించేందుకు పెట్టిన సంస్థ. స్వయం ప్రతిపత్తి కూడా ఉంది. ఒకప్పుడు అతిరథ మహారథులు బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటిచోట పందికొక్కులు చేరాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటికు పది మంది నిందితులుగా తేలారు. టెక్నికల్‌గా వాళ్లు నిందితులే అయినా.. అక్రమాలు మామూలుగా లేవని త్రిసభ్య కమిటీ తేల్చేసింది. అయితే.. పాత్రధారులు ఎంతమంది.. అసలు సూత్రధారులు ఎవరనేది ఆసక్తిగా మారింది. తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

తెలుగు అకాడమీ కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చేశారు హైదరాబాద్ పోలీసులు. తెలుగు అకాడమీ నిధుల దుర్వినియోగం కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులు యూనియన్ బ్యాంక్ ద్వారా దారి మళ్లినట్లు సెప్టెంబర్ 27న ఫిర్యాదు వచ్చిందని సీపీ తెలిపారు. ఈ స్కాంలో మూడు కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి విచారించామన్నారు. దాదాపు రూ.64.50 కోట్ల వరకు నిధుల గోల్‌మాల్ జరిగిందని సీపీ అంజనీకుమార్ వివరించారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విడతలవారీగా నిధులను డ్రా చేశారన్నారు. ఈ కేసులో ప్రమేమం ఉన్నవారిలో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, మరో 9 మంది అనుమానితుల కోసం వేట కొనసాగిస్తున్నామని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు.

ఈ అక్రమాలకు పాల్పడ తెలుగు అకాడమీ అకౌంట్స్ ఆఫీసర్ రమేష్తో పాటు చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన, రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటకోటి సాయికుమార్‌లను అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. కాగా ఈ కేసులో సాయికుమార్ ప్రమేయం చాలా కీలకంగా ఉందన్నారు. 2015 ఏపీ హౌసింగ్ బోర్డ్ స్కాంలో సాయికుమార్‌ను సీఐడీ విచారించిందన్నారు. రూ.25 కోట్ల మోసం కేసులో సాయికుమార్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ వెల్లడించారు.

తెలుగు అకాడమీ కుంభకోణంలో డొంక మొత్తం కదులుతోంది. అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా.. కెనరా బ్యాంక్‌ చందానగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ సాధనను అరెస్ట్ చేశారు CCS పోలీసులు. అటు.. యూనియన్ బ్యాంక్‌ మేనేజర్‌ మస్తాన్ ‌వలీని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు బాగా తెలిసిన ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్‌ చేశారు. యూనియన్‌ బ్యాంక్ మేనేజర్‌ మస్తాన్‌వలీతో ఏజెంట్లు నండూరి వెంకట్, సాయి, వెంకట్‌ కుమ్మక్కయ్యారు. కమీషన్లు ఇస్తామంటూ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపారు.

ఈకేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్‌ మస్తాన్ వలీని కస్టడీలోకి తీసుకున్నారు CCS పోలీసులు. మొత్తం స్కామ్‌ అతని చుట్టూ తిరిగిందని అధికారులు భావిస్తున్నారు. అతన్ని ఆరు రోజుల కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. ఇదే సమయంలో అకౌంట్స్‌ ఇంచార్జ్‌ రమేష్‌ను కూడా అరెస్ట్‌ చేసారు. అకాడమీకి సంబంధించిన రూ. 65 కోట్ల డిపాజిట్లు దారి మళ్ళించారు అక్రమార్కులు. ఇందులో యూనియన్‌ బ్యాంకుకు చెందిన కార్వాన్ బ్రాంచ్ నుంచి రూ.43 కోట్లు, సంతోష్ నగర్ శాఖలో రూ.12 కోట్లు, చందానగర్‌ అకౌంట్‌ నుంచి రూ.10 కోట్లను విడతలవారీగా ఏపీ మర్కంటైల్‌ సొసైటీ బ్యాంక్‌కు మళ్లించి సొమ్ము చేసుకున్నారు.

త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తెలుగు అకాడమీలో అక్రమాలు నిజమని తేల్చారు. అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని, అధికారులను, సిబ్బందిని, బ్యాంకు అధికారులను ఆ కమిటీ ఎంక్వైరీ చేసింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల నిర్వహణలో శాఖాపరమైన నిర్లక్ష్యం జరిగిందని సూటిగా చెప్పేసింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా లావాదేవీలు జరపడం, అకౌంట్స్ విభాగం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారణంగా చెప్తున్నారు.

Read Also… Railway Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ కేంద్రంగా రైల్వే ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేయండి