Andhra Pradesh Crime News: అనుమానం ఆ వ్యక్తికి పెనుభూతంగా మారింది. దీంతో రోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో.. ఓ వ్యక్తి తన భార్యను నాటు తుపాకీతో కాల్చి దారుణంగా చంపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట కాలనీ అనే గిరిజన తండాలో వెలుగులోకి వచ్చింది. భరణికోట కాలనీకి చెందిన జగ్గరావు, సవర పద్మ(33) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. భార్యపై అనుమానంతో జగ్గారావు గత కొన్నాళ్లుగా భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. మద్యం తాగొచ్చి రోజూ వేధింపులకు పాల్పడతుండేవాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గరావు తన వద్దనున్న నాటు తుపాకీతో పద్మను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.
కాగా.. గ్రామానికి చెందిన వ్యక్తులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఇటీవల అదే గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి తన సోదరుడిని చంపాడు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ ఇలాంటిదే చోటు చేసుకోవడంతో గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతువుల నుంచి రక్షణ కోసమని ఈ ప్రాంత గిరిజనులు నాటు తుపాకులను తమ వద్ద ఉంచుకుంటున్నారు. అవే వారి ప్రాణాలు తీస్తున్నాయంటూ పలువురు పేర్కొంటున్నారు.
Also Read: