Crime News: 72 ఏళ్ల వయస్సులో కూడా భార్యను చిత్ర హింసలకు గురిచేసిన ఘటన హైదరాబాద్ రాంనగర్‌లో చోటుచేసుకుంది. గంగాధర్ అనే వ్యక్తి గత 8 నెలలుగా భార్య బేబీని ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ముషీరాబాద్‌లోని గణేష్ నగర్‌లో ఈ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం గంగాధర్.. భార్యను ఇంట్లో ఉంచి తాళం వేసి పరారయ్యాడు. అయితే ఇంట్లోంచి కేకలు వినిపించడంతో.. ఇంటి యజమానులు అతని భార్య బేబీని గుర్తించారు. ఆమెకు మూడు రోజులుగా కిటికీ నుంచి స్థానికులే ఆహారం అందిస్తున్నారు. అయితే పరారీలో ఉన్న భర్త గంగాధర్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో… ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు తాళాలు బద్దలకొట్టి.. బేబీని బంధ విముక్తురాలిని చేశారు. కాగా.. కృష్ణా జిల్లాలో గంగాధర్ వీఆర్వోగా పనిచేసేవాడని తెలిసింది. అయితే ఇంత లేటు వయసులో కూడా తన భార్యను చిత్ర హింసలు పెట్టిన ఈ శాడిస్ట్ భర్త వైనం స్థానికులను షాక్‌కి గురిచేసింది. కాగా అతని దుర్మార్గంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.