Girl Murder in kurnool: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మరో దిశ తరహా దారుణ సంఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పరిధిలోని బనగానపల్లె యాగంటిపల్లెలో బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండకు చెందిన కొందరు జీఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన కాల్వ లైనింగ్ పనుల కోసం కర్నూలు వెళ్లారు. బాలిక తండ్రి ఉదయం కాల్వ పనులు చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆ పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్ల దగ్గర కుమార్తె ఉంది. అయితే.. బాలిక తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె.. షెడ్ పక్కన మంటల్లో కాలిపోయి ఉంది. కూతురు ఇలా ఉండటాన్ని చూసిన తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. అనంతరం అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే బాలికపై ఎవరైనా లైంగికదాడికి పాల్పడి.. అనంతరం పెట్రోల్ పోసి హత్య చేశారా.. లేక బాలిక ఆత్మహత్య చేసుకుందా అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా.. బాలికపై అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: