తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మదనపల్లి (Madanapalle) జంట హత్యల కేసును మరవకముందే అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు తాను దేవతనంటూ ప్రకటించుకున్న ఓ బాలిక కత్తితో హల్ చల్ చేసింది. తండ్రి, పెదనాన్నలను గాయపరచడమే కాకుండా ఇంట్లో నిద్రిస్తున్న చెల్లిని దారుణంగా హత్య చేసింది. కత్తితో తల నరికి అంతమొందించింది. రాజస్థాన్ (Rajasthan) లోని డూంగర్ పూర్ పరిధిలోని జింజ్వాఫాలా గ్రామానికి చెందిన శంకర్.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేస్తుండగా గ్రామస్థులు వచ్చి దశ మాత అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో శంకర్ కుమార్తె వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న కత్తిని తీసుకుంది. తాను అమ్మవారి అంశనంటూ గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆమెను అదుపు చేసేందుకు శంకర్‌తో పాటు అతడి అన్నయ్య సురేశ్ తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ బాలికను అదుపు చేయలేకపోయారు. అంతే కాకుండా బాలిక వీరిద్దరినీ కత్తితో గాయపరిచింది. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. బాలిక ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లో నిద్రిస్తున్న సురేశ్ తొమ్మిదేళ్ల కుమార్తెను తలను కత్తితో నరికేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఘటన సంచలనం రేకెత్తించింది. దేవుడు వచ్చి తమ కూతుళ్లను బతికిస్తాడంటూ కడుపున పుట్టిన పిల్లల్నే దారుణంగా కొట్టి హతమార్చారు. ఎన్.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తుండగా.. అతని భార్య పద్మజ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అలేఖ్య, సాయిదివ్య పిల్లలు. వీరంతా గతేడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా కట్టించిన ఇంట్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఇంట్లో పూజలు చేసి, చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి