TWO HEAD SNAKES : పర్యావరణానికి మేలు చేసే రెండు తలల పాములను విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను గుంటూరులో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రెడ్ శాండ్ గోవా పేరుతో పిలిచే 3 రెండు తలల పాముల్ని చుట్టుగుంట వద్ద స్వాధీనం చేసుకున్నారు.కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కొండయ్య, గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన జిలానీ, గుండ్లపల్లికి చెందిన షేక్ నాగూర్ వలీని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పాములను అమ్మే ప్రయత్నంలో ఉన్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
నిందితుల అరెస్టుపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు మాట్లాడుతూ.. విషరహితంగా ఉండే ఈ పాములు పొలాల్లో ఎలుకలను తింటూ పంటలను రక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని తెలిపారు. ఇవి ఇంట్లో ఉంటే కలసి వస్తుందనే మూఢనమ్మకంతోనే కొంతమంది వీటిని అధిక ధరలు చెల్లించి కొంటున్నారని అన్నారు.
ఈ పాముల విక్రయం, రవాణా, అటవీశాఖ చట్టాల రీత్యా నేరమని ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని హెచ్చరించారు. ఇవి రెండు తలల పాములనే అపోహలో వీరందరు ఉన్నారని కానీ వాస్తవానికి ఇవి కాదని అన్నారు. వాస్తవానికి తోక, తల ఒకేలా ఉండటం వల్ల అందరు రెండు తలల పాముగా వ్యవహరిస్తున్నారని వివరించారు. గ్రామాల్లో ఇలాంటి గ్యాంగ్‌లు సంచరిస్తున్నాయని సమాచారం తెలిసిందన్నారు. ఎవరైనా సరే వీటికోసం వెతికినట్లు తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకృతికి సాయం చేసే ఇలాంటి జీవులను హింసించడం మంచిది కాదన్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.