Fox Attack :అప్పుడప్పుడు జనావాసాల్లోకి అడవి జంతువులు వచ్చి హల్‌చల్ చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా పులులు, చిరుత, ఎలుగుబంట్లు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటికి అడవిలో సరైన తిండి దొరకకపోవడంతో ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తాయి. అప్పుడప్పుడు పాడి జంతువులు, మనుషులపై కూడా దాడి చేస్తాయి. అయితే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో కూడా ఇదే జరిగింది. కానీ పులి, ఎలుగబంటియో కాదు ఓ నక్క గ్రామంలోకి వచ్చి హల్‌చల్ చేసింది. జనాలందరు ఆగమాగం అయ్యారు.
అటవీ ప్రాంతం నుంచి దరిమడుగు గ్రామంలోని జనావాసాల్లోకి ఓ నక్క వచ్చింది. దానిని చూసిన గ్రామస్తులు భయంతో గ్రామం నుంచి తరిమేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సింహాద్రీ అనే యువకుడిని కరిచింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్థులు కర్రలతో దానిని కొట్టి చంపేశారు. అనంతరం నక్క దాడిలో గాయపడ్డ సింహాద్రిని ఆసుపత్రికి తరలించారు. నక్కను తరిమేందుకు గంట పాటు గ్రామస్థులు నానా హడావిడి చేశారు. గ్రామస్థుల హంగామాతో బెదిరిన నక్క ప్రాణభయంతో జనంపై దాడి చేసింది. ఈ సంఘటనతో గ్రామస్థులు కొద్దిసేపు భయాందోళనలకు గురయ్యారు.
అయితే ఏ జంతువైనా దానికి హాని చేయకపోతే అది మనల్ని ఏం చేయదు. ఎప్పుడైతే దాని ప్రాణాల మీదికి వస్తుందో అప్పుడు అది అటాక్ చేస్తుంది. ప్రస్తుతం నక్క పరిస్థితి కూడా ఇలాగే జరిగింది. అడవి నుంచి తప్పించుకున్న నక్కకు ఎటు వెళ్లాలో తెలియక గ్రామంలో అటు ఇటూ తిరిగింది. కానీ జనాలు దానిని చూసి భయపడ్డారు. దానికి అడవిలోకి మార్గం చూపిస్తే అటువైపుగా వెళ్లేది. జనాలా హడావిడితో బెదిరిపోయి ప్రాణాలు కోల్పోయింది.