Major Road Accident: పంజాబ్‌లో ఘరో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ విషాద ఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఖోఖర్ గ్రామ శివారులో కారు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. మృతులను కలానౌర్‌కు చెందిన వారిగా గుర్తించారు. గురువారం రాత్రి గుర్నమ్ సింగ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి గురుదాస్‌పూర్‌లో ఉన్న వైద్యుడిని కలిసేందుకు స్నేహితుడు బిక్రమ్ మాసితో కలిసి కారులో వెళ్లారు. వైద్యుడిని కలిసి తిరిగి కలానౌర్ గ్రామానికి వెళ్తున్న సమయంలో ఖోఖర్ సమీపంలోని కేంబ్రిడ్జ్ పాఠశాల సమీపంలో ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తూ.. కారు.. టిప్పర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాతపడినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురుదాస్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: