బంగారం రేట్లు అంతలా మండిపోతుంటే తక్కువ ధరకు ఎలా వస్తుంది చెప్పండి. కాస్త చవకగా ఏదైనా దొరుకుతుంది అంటే చాలు ముందూ వెనక ఆలోచించకుండా కొందరు ఎగబడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను అదునుగా చేసుకొని అదే పనిగా మోసచేయడానికి రెడీగా జాదుగాళ్లు ఉంటారు. ఇదే తరహాలో కడప జిల్లా చిన్నమండెం మండలంలో 100 గ్రాముల బంగారం తక్కువ ధరకు ఇస్తాం అని నకిలీ బంగారం అంటగట్టి.. లక్షా 50 వేలు రూపాయలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే…చిన్నమండెం మండలంలో షేక్ అల్తాఫ్ అనే వ్యక్తి మండలంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకుంటుండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి బంగారం తక్కువ ధరకు ఉంది, 100 గ్రాముల బంగారం గొలుసు కేవలం ఒక లక్షా 50 వేలకు ఇస్తాం అని చెప్పి బాధితుడు అల్తాఫ్ కు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయారు. అల్తాఫ్ ఇంట్లోని కుటుంబ సభ్యులతో చర్చించి సదరు ఇద్దరు వ్యక్తులతో మొబైల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి 100 గ్రాముల బంగారం కొంటానని చెప్పడంతో.. నిందితులు గోవింద్ శివ నాయక్, శ్రీక్రిష్ణలు అల్తాఫ్ కి ఆ గోల్డ్ చైన్ ఇచ్చి ఒక లక్షా 50 వేలు తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం బంగారం షాపుకు వెళ్లి బంగారం గొలుసును చెక్ చేపించగా అది నకిలీ బంగారం అని చెప్పడంతో అల్తాఫ్ అవాక్కయ్యాడు.
వెంటనే హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం గొలుసు విషయాన్ని పోలీసులకి చెప్పి మోసపోయినట్టు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగలోకి దిగిన చిన్నమండెం పోలీసులు విచారణ మొదలు పెట్టి విరబల్లి మండలం షికారి పాలెం కి చెందిన ప్లాస్టిక్ పూల వ్యాపారం చేస్తున్న గోవింద్ శివ నాయక్, శ్రీక్రిష్ణ అనే ఇద్దరు పాత నేరస్థులను విచారించారు. విచారణలో ఈ ఇద్దరే అల్తాఫ్ ని మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 100 గ్రాములు నకిలీ బంగారంతో పాటు లక్షా నలభై ఏడు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో రాయచోటి సబ్ డివిజన్ లో కూడా పలు కేసులు నమోదు అయ్యాయని డిఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఏది ఏమైనా అతిగా ఆశకు పోకుండా చిక్కుల్లో పడకుండా ఉండాలని డిఎస్పీ సూచించారు.
Also Read: రైతుగా మారిన సీఐ.. అన్నదాతలకు పర్సనల్ ఫోన్ నంబర్ ఇచ్చి ఏం చెప్పాడంటే…?