Hyderabad Crime News: ఆ దంపతులు అడ్డదారిలో డబ్బు సాంపాదించాలనుకున్నారు. దాని కోసం ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి పేరిట ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసిన కిలాడి దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గుంటూరు జిల్లాకు చెందిన యర్రగుడ్ల దాసు, జ్యోతి.. కల్యాణిశ్రీ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యారు. దాదాపు అతనితో ఏడాదిన్నరపాటు ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. ఆ తర్వాత ఖర్చులంటూ, బదులు అంటూ దశల వారీగా రూ.కోటి కాజేశారు. అయితే.. వారు చెప్పే మాటలతో తీరా మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు నిందితులను గుర్తించారు. అనంతరం ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి మంగళవారం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. బాధిత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు నలభై ఏళ్లు వస్తున్నా పెళ్లి కాలేదు. ఈ క్రమంలో యర్రగుడ్ల దాసు.. కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడని.. ఆ తర్వాత ప్రేమ పేరిట కేవలం చాటింగ్ చేసే వాడని తెలిపారు. విజయవాడలో ఉంటున్నానని, సంప్రదాయ కుటుంబమని నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. ఫోన్ చేయకుండా షరతులు విధించి కేవలం చాటింగ్ మాత్రమే చేసేవాడని తెలిపారు. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తానూ ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుందామంటూ మెస్సెజ్ చేయడంతో.. పెళ్లి సంబంధం మధుసూదన్ అనే వ్యక్తితో మాట్లాడాలంటూ నిందితుడు ఒక ఫోన్ నంబర్ ఇచ్చారని తెలిపారు.
మధుసూదన్‌లా కూడా దాసే నటించాడని పోలీసులు పేర్కొన్నారు. అలా నటిస్తూ దాసు దంపతులు 2020 జూన్ నుంచి 2021 అక్టోబరు వరకు రూ.కోటి కాజేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి పేరుతో మోసం చేసిన దాసు నూజివీడు ట్రిపుల్ ఐటీ పూర్తి చేసి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేశాడని.. పోలీసులు వెల్లడించారు.
Also Read: