Khammam District: పచ్చని కాపురంలో నిప్పులు.. అక్రమ సంబంధం కాటుకు ముగ్గురు బలి

|

Sep 03, 2021 | 8:27 PM

వివాహేతర సంబధాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఏకంగా ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. తాజాగా మూడు ప్రాణాలు వివాహేతర సంబధం వల్ల...

Khammam District: పచ్చని కాపురంలో నిప్పులు.. అక్రమ సంబంధం కాటుకు ముగ్గురు బలి
ధర్మయ్య, కృష్ణవేణి, బాలయ్య
Follow us on

వివాహేతర సంబధాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. ఏకంగా ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. తాజాగా మూడు ప్రాణాలు వివాహేతర సంబధం వల్ల బలైపోయాయి. రెండు కుంటుబాలు విషాదంలో మునిగిపోయాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  లంకపల్లికి చెందిన ఇంజిమళ్ల బాలయ్య (32), కృష్ణవేణి (27) భార్యాభర్తలు. అదే కాలనీలో నివాసం ఉండే పచ్చినీళ్ల ధర్మయ్య (30), కృష్ణవేణిల మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది.  గొడవల నేపథ్యంలో ఆగస్టు 26న ధర్మయ్య, కృష్ణవేణి ఇళ్లు వదిలి పారిపోయారు. దీంతో మనస్తాపం చెందిన బాలయ్య 27న ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ 29న తుదిశ్వాస విడిచాడు.

ఇక అదే కాలనీకి చెందిన వజ్రమ్మ ఇటీవల వేంసూరులోని తన కుమార్తె వద్దకు వెళ్లి గురువారం తిరిగి వచ్చింది. ఆమె తన ఇంటి తలుపు తీయగానే కుళ్లిపోయిన స్థితిలో రెండు డెడ్‌బాడీలు కనిపించడంతో షాక్‌కు గురైంది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీపీ వెంకటేశ్‌, సీఐ కరుణాకర్‌, ఎస్సై నాగరాజు వెళ్లి విచారణ ప్రారంభించారు. దుస్తుల ఆధారంగా డెడ్‌బాడీలు ధర్మయ్య, కృష్ణవేణిలవని స్థానికులు గుర్తించారు. బాలయ్య, కృష్ణవేణిల మృతితో వారి పిల్లలు చందన్‌కుమార్‌ (10), వెంకటలక్ష్మి (7) అనాథలుగా మిగిలిపోయారు. ధర్మయ్య తండ్రి వెంకటరత్నం కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ధర్మయ్యకు ఏపీలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట ప్రాంతానికి చెందిన మహిళతో పెళ్లైంది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. విభేదాల నేపథ్యంలో ధర్మయ్య భార్య విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌లో భర్తపై కేసు కూడా పెట్టింది. అతడు భార్యాబిడ్డలకు దూరంగా లంకపల్లిలోనే నివసించేవాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read: గంటా తులసి.. స్కెచ్‌ వేస్తే ఖేల్ ఖతమే.. ఆటో ప్రయాణికులే టార్గెట్.. ఇప్పటికే 20 కేసులు

‘జగనన్న విద్యా దీవెన’పై హైకోర్టు కీలక తీర్పు… ఇకపై డబ్బు వారి అకౌంట్లలోకే