మంత్రి కేటీఆర్‌ పీఏను అంటూ వసూళ్ల దందా.. నిందితుడు మాజీ రంజీ ప్లేయర్.. రెండు రాష్ట్రాల్లో 7 కేసులు

మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు వరుస మోసాలు చేస్తున్నాడు. గతేడాది నగరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్‌ వేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కాడు.

మంత్రి కేటీఆర్‌ పీఏను అంటూ వసూళ్ల దందా.. నిందితుడు మాజీ రంజీ ప్లేయర్.. రెండు రాష్ట్రాల్లో 7 కేసులు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 06, 2021 | 12:10 PM

మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శినంటూ ఓ ఘరానా నేరగాడు వరుస మోసాలు చేస్తున్నాడు. గతేడాది నగరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్‌ వేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కాడు.

ఓ ఫార్మా కంపెనీకి ఫోన్‌ చేసిన ఇతగాడు రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్‌ ఠాణాలో కేసు నమోదు కాగా.. నిందితుడు బి.నాగరాజును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇతగాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ ఆటగాడు కావడం గమనార్హం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజుపై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఏడు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నగరానికి చెందిన ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థ సీఎండీకి ఫోన్‌ చేసి మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి తిరుపతిని మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగరాజు బొడుమూరు అనే యువకుడు క్రికెట్‌లో ప్రతిభ కనబరుస్తున్నాడని, ఇంగ్లాండ్‌లో జరిగే అండర్‌– 25 వరల్డ్‌ కప్‌కు అతడు సెలెక్ట్‌ అయ్యాడని చెప్పి తనను తానే ప్రమోట్‌ చేసుకున్నాడు. ఈ టోర్నీలో పాటు సన్‌రైజ్‌ టీమ్‌కూ ఎంపికయ్యాడని చెబుతూ.. అతడు పేద కుటుంబానికి చెందిన వాడని చెప్పుకొన్నాడు. అతడికి క్రికెట్‌ కిట్‌తో పాటు లండన్‌ టూర్‌ ఖర్చుల స్పాన్సర్‌ షిప్‌ అవసరం ఉందని, అందుకు రూ. 3.3 లక్షలు ఖర్చవుతాయన్నాడు. ఇదంతా విన్న సదరు సీఎండీ పూర్తిగా తన మాటల వలలో పడ్డారని మోసగాడు నిర్ధారించుకున్నాడు. దీంతో స్పాన్సర్‌షిప్‌ నగదును డిపాజిట్‌ చేయాలంటూ ఓ బ్యాంకు ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఈ టోర్నీకి సంబంధించిన క్రికెట్‌ కిట్‌ను నాగరాజు బెంగళూర్‌లో మీ కంపెనీ పేరుతోనే ప్రింట్‌ చేయిస్తున్నాడని, దాన్ని కేటీఆర్‌ చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో, మీడియా సమక్షంలో అందుకుంటాడని చెప్పాడు.

ఇది సదరు కంపెనీకి మంచి పబ్లిసిటీ ఇస్తుందంటూ నమ్మించాడు. ఇతని మాటల్ని అనుమానించిన ఆ సంస్థ ప్రతినిధులు తొలుత సందేహించారు. తమకు కాల్‌ వచ్చిన ఫోన్‌ నంబర్‌ను ట్రూ కాలర్‌ యాప్‌లో తనిఖీ చేయగా అందులో తిరుపతి అనే పేరే కనిపించింది. దీంతో అతడు కేటీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శిగానే నమ్మిన సంస్థ నగదును ఆంధ్రప్రదేశ్‌లోని నర్సన్నపేట్‌లోని కెనరా బ్రాంచ్‌ శాఖలో ఉన్న ఖాతాకు బదిలీ చేశారు. త్వరలో ఎల్బీస్టేడియంలో కేటీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని నాగరాజు ఆ కంపెనీ వారితో చెప్పాడు. ఆ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా ఆ సంస్థనే కేటీఆర్ ఎంపిక చేశారంటూ మరో ఎర వేశాడు. ఆపై తన బంధువు ఒకరు రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, బిల్లుల కోసం రూ.2 లక్షలు సహాయం చేయాలని కోరాడు. రాజమండ్రిలోని ఎస్‌బీఐ శాఖలో అప్పలనాయుడు పేరుతో ఉన్న ఖాతా వివరాలను పంపాడు. దీంతో అనుమానం వచ్చిన సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా తాము మోసపోయామని తేలింది. బాధ్యుల్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు నాగరాజును అరెస్టు చేశారు.

తాజాగా నగరానికి చెందని ఓ ఫార్మా కంపెనీకి కేటీఆర్‌ పీఏగా పని చేస్తున్న తిరుపతిరెడ్డి పేరుతో నాగరాజు కాల్‌ చేశాడు. కాలుష్య నియంత్రణ మండలి ఆ సంస్థను మూసేస్తోందని, అలా కాకుండా చేయాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని చెప్పాడు. దీనిపై జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు కాగా.. రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు తన బృందంతో వల పన్నారు. సోమవారం నాగరాజు కదలికల్ని గుర్తించి అరెస్టు చేశారు. 2014– 16 మధ్య ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీ జట్టులో ఎంపికైన బుడుమూరు నాగరాజు గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

బీసీసీఐ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడని, మరో ప్రముఖ రాజకీయ నాయకుడి వ్యక్తిగత సహాయకుడిగా పేర్కొంటూ ఢిల్లీలోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడి నుంచి డబ్బు డిమాండ్‌ చేసి అరెస్టు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా రెయిన్ బో హాస్పిటల్ ఎండీని బేదిరించిన కేసులో ఈరోజు మరోసారి అరెస్ట్ అయ్యాడు.

Also Read:

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు

“అదిగో లచ్చిందేవి.. ఇదిగో లచ్చిందేవి” అన్నారు.. మహిళ దగ్గర 21 లక్షలు దోచుకుని వెళ్లిపోయారు