Jammu Kashmir Encounter : జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాల నిరంతర నిఘా ఉన్నప్పటికీ ఉగ్రవాదులు చర్యలు ఆగడంలేదు. రాజౌరి జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు సైనికులు కూడా అమరవీరులయ్యారు. హతమార్చిన ఉగ్రవాదుల నుంచి రెండు ఎకె 47 రైఫిళ్లతో సహా భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా అధికారులు చెబుతున్నారు.
మీడియా నివేదికల ప్రకారం.. జూన్ 29 న సుందర్బని సెక్టార్ దాదాల్ గ్రామంలో కొంతమంది అనుమానితులను నియంత్రణ రేఖలో చూశారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. దాదల్ అరణ్యాలలో ఒక గుహలో దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ ఆపరేషన్ సమయంలో సైన్యం తమ వద్దకు రావడాన్ని చూసి గ్రెనేడ్లను విసిరి కాల్పులు ప్రారంభించారు. తరువాత సైన్యం తేరుకొని ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మద్రాస్ రెజిమెంట్ ఆఫ్ ఆర్మీకి చెందిన నాయబ్ సుబేదార్ శ్రీజిత్, సిపాయి జస్వంత్ రెడ్డి అమరులయ్యారు. కాగా ఒక యువకుడు కూడా గాయపడ్డాడు. అమరవీరుల మృతదేహాలను సుందర్‌బని ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే స్థానిక ప్రజలు ‘వీర్ జవాన్ అమర్ రహే, భారత్ మాతా కి జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్’ నినాదాలు చేశారు. ఇది మొత్తం ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించింది. అమరవీరులపై పూలమాలలు వేసి ప్రజలు నివాళులర్పించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అంతకుముందు రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం విఫలమైంది. ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని కాల్చి చంపారు. నియంత్రణ రేఖ వెంట చొరబడిన ఉగ్రవాదులను అరికట్టడానికి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు కూడా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల బృందం బుధవారం తెల్లవారుజామున రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖను దాటడానికి ప్రయత్నించిందన్నారు.
ఇదిలా ఉంటే.. జమ్ముకశ్మీర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశంలో భారీగా విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే భారత సరిహద్దుల వెంట హై టెక్నాలజీ కెమెరాలను, సెల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశం సరిహద్దులు దాటుకుని వచ్చేందుకు కొందరు టెర్రరిస్టులు ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా భారత జవాన్లపైకి కాల్పులకు తెగబడుతున్నారు.