Dwaraka Trumala Black Magic pooja: పశ్చిమగోదావరి జిల్లాలో ద్వారకాతిరుమల మండలం తూర్లలక్ష్మీపురంలో క్షుద్రపూజల కలకలం రేగింది. 4 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అర్ధరాత్రి ఓ తోటలో క్షుద్ర పూజలు చేసినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. రోజు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఈ క్షుద్రపూజలు నిర్వహించి వుంటారని స్థానికులు భావిస్తున్నారు. క్షుద్రపూజలు జరిపారని అనుమానిస్తున్న స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గుమ్మడి కాయ పడి ఉన్నాయి.
ఈఘటనకు సంబంధించి.. ఇద్దరిని గ్రామస్తులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎవరికో చేతబడి చేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. అనుమానితుల దగ్గర అనుమానిత డబ్బాలు ఉన్నాయి. వాటితో పాటు గ్రంధాలు, రుద్రాక్షలు, ఆకులతో పాటు ఏవేవో సామాగ్రి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇవన్నీ క్షుద్రపూజల్లో ఉపయోగించే వస్తువులని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. నిత్యం జనాలు తిరిగే ప్రదేశాల్లో ఇలాంటి అనుమానిత ఘటనలు జరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ద్వారకా తిరుమల అంటే అధ్యాత్మిక ప్రాంతంగా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న శ్రీవారి ఆలయానికి దిగువ తిరుపతిగా పేరుంది. నిత్యం వందలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళ్తుంటారు. ఇలాంటి ప్రదేశంలో క్షుద్రపూజలు జరగడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
గ్రామానికి చెందిన నరసింహమూర్తి అనే రైతు తన ఆవు అస్వస్థతకు గురవడంతో అర్ధరాత్రి దాని పరిస్థితి చూసేందుకు పొలం వెళ్ళాడు. అయితే నరసింహమూర్తి తోట సమీపంలో మంటలతో కూడిన వెలుగు కనిపించడంతో అక్కడికి వెళ్లి చూసాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మంత్రాలు చదువుతూ ఏవో పూజలు చేస్తున్నట్లుగా గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. రహస్య పూజల వద్దకు చేరుకున్న గ్రామస్తులు పూజలు చేసే ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో గ్రామస్తులు వారిని తీవ్రంగా హెచ్చరించి విడిచిపెట్టారు.