Hyderabad Police: ఆమె వైద్యురాలు.. జీవితంపై ఎన్నో ఆశలతో ఆమె.. వైద్యుడినే పెళ్లాడింది. వారి వివాహం జరిగి ఆరు నెలలే అయింది.. అప్పుడే భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. చివరకు వరకట్న వేధింపులు తాళలేక వైద్యురాలైన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నర్సాపూర్‌కు చెందిన డాక్టర్ వంగ భారతి (31) స్త్రీ వైద్య నిపుణురాలు.. ఆమెకు కరీంనగర్‌లోని జమ్మికుంటకు చెందిన పిల్లల వైద్య నిపుణుడైన డా.కనకట్ట రమేష్‌తో గతేడాది డిసెంబరు 9న వివాహం జరిగింది. వివాహం సమయంలో భారతి తల్లిదండ్రులు.. ఎకరం పొలం, రూ.5లక్షల నగదు, 20 తులాల బంగారం వరకట్నంగా అందజేశారు.
అయితే.. వివాహం అనంతరం భారతి, రమేష్ గత ఆర్నెల్లుగా ఎల్బీనగర్ సమీపంలోని సూర్యోదయనగర్‌లో నివాసం ఉంటున్నారు. రమేష్ అత్తాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఆన్‌కాల్‌పై ఉద్యోగం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆసుపత్రి పెడదామంటూ భార్యతో చెప్పాడు. దీనికోసం అదనపు కట్నం కోసం తీసుకురావాలంటూ రమేష్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. మద్యం తాగొచ్చి తీవ్రంగా హింసిస్తుండటంతో.. అతని వేధింపులు తాళలేక భారతి 15 రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. వారం క్రితం పెద్దలు ఇద్దరికీ నచ్చజెప్పడంతో ఆమె హైదరాబాద్‌కు వచ్చింది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తల్లిదండ్రులు భారతికి ఫోన్ చేశారు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. శనివారం ఉదయం రమేష్ కు ఫోన్ చేసి అడగడంతో అతను ఆస్పత్రిలోనే ఉన్నానని చెప్పాడు. చివరకు అతను ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె విగతజీవిగా పడి ఉంది. దీంతో అతను ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో భారతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..