Delhi Teen Thrashed By Farmhouse Owner: మానవత్వం మంటగలుస్తోంది. మనిషి అన్న కనికరం లేకుండాపోతోంది. అనుమానంతో ఓ బాలుడి కొట్టి చంపారు దుర్మార్గులు. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనుకుని 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించిన బాధితుడు.. ఎంత అరిచినా సాయం చేసేవారు లేకపోయారు. చివరకు కనికరంలేని ఈ లోకం నుంచి ప్రాణాలు విడిచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఓ డ్రైవర్ కుమారుడైన సందీప్ మహతో(16) బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి దేశ రాజధాని శివారు ప్రాంతం కపాషెరా సరిహద్దు ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు వారిని దొంగలుగా భావించి, యజమాని ప్రకృత్ సాంధూను అప్రమత్తం చేశాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని సాంధూ బాలుడు సందీప్‌ను బంధించాడు. మిగతా ఇద్దరు స్నేహితులు భయంతో పారిపోయారు.
అయితే, సందీప్ దొంగతనం చేసేందుకు వచ్చాడనుకుని, ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. దీంతో బాలుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి తప్పించుకున్న బాలుడు కొంతదూరంలో రోడ్డుపై పడిపోయాడు. ఎంత అరిచినా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇంతలో వీధి శునకాలు అతడిపై దాడి చేశాయి. కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించిన సందీప్ ప్రాణాలను కోల్పోయాడు. సాయంత్రం 4.30 గంటలకు విగతజీవిగా పడి ఉన్న బాలుడిని చూసిన ఓ వాహనదారుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సందీప్ మృతికి కారణమైన ఫామ్‌హౌస్ యాజమాని ప్రకృత్ సాంధూ(35)తోపాటు రోహిత్(20), అతడి తండ్రి బినోద్ ఠాకూర్(62)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.