DBI Bank Scam: లోన్లు ఇస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం.. క్రెడిట్ కార్డులు ఇస్తామని ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడే కేటుగాళ్లను చూశాం. కానీ పాన్ షాప్ పెట్టుకున్నంత ఈజీగా బ్యాంక్ పెట్టుకోవచ్చు అని బురడీ కొట్టించే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు నెట్టింట్లో అమాయకులతో ఆడుకుంటున్నారు. ఇలాంటి సైబర్ గాళ్ల ఘరానా మోసం చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవునికణపాక లో కొల్లి సత్యరావు అనే పాల వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. ఇతని మొబైల్‌కి ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. మీకు బ్యాంక్ పెట్టాలనే ఆసక్తి ఉందా? అని అడిగారు.. బ్యాంకా? అదేంటి నాకు ఒక అక్కౌంట్ ఉంది? అది తప్పా నాకు బ్యాంక్ గురించి తెలియదు అన్నాడు సత్యారావు.. మీకు తెలియకపోతే ఇంకా మంచిది.. అన్ని మేమే నేర్పిస్తాం.. రోజూ లక్షల్లో మీ బ్యాంక్ కి డబ్బులు వస్తాయి. మీకు చాలా రాబడి వస్తుంది అని ఆశజూపారు. అంతటితో ఆగకుండా ఇంకా చాలా కట్టుకథలు చెప్పారు నిందితులు.
తాము డిజిటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అని.. ఎస్బీఐ తరుపున పని చేస్తున్నామని.. అందులో భాగంగా మీ జిల్లా ఏరియాకి ఒక బ్యాంక్ ఇస్తున్నామని చెప్పారు. మేమిచ్చే బ్యాంక్ ద్వారా ఎటీఎం మిషన్ ఇస్తామని.. అంతేకాకుండా మీ వద్ద బ్యాంక్ లావాదేవీలు కూడా జరుగుతాయని ఘరానా మాటలు చెప్పారు.
మీ ఏరియాలో ఉన్న ఎస్బిఐ సర్వీసులు అన్ని మీరే నిర్వహించాలని చెప్పారు. నిందితులు చెప్పిన మాటలతో బ్యాంక్ బిజినెస్ పై ఆసక్తి చూపాడు బాధితుడు.. దీంతో ప్రక్రియ ప్రారంభించేందుకు ఓకే అన్నాడు. వెంటనే నిందితులు అడిగిన డిటైల్స్ ఇచ్చాడు. అంతేకాకుండా ప్రక్రియలో భాగంగా పలుమార్లు పలు బ్యాంకుల ద్వారా సుమారు ఎనిమిది లక్షల మేర నగదు నిందితుల అక్కౌంట్స్ కి బదిలీ చేశాడు.
అలా వారు అడిగినప్పుడు అమౌంట్ ఇస్తున్నా.. పంపిస్తామన్న ఎటిఎం మిషన్, ఎక్విప్మెంట్ ఏమి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు పిర్యాదు చేశాడు బాధితుడు. ఈ ఘటన పై సెప్టెంబర్ 6 న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తమకు దొరికిన ఆధారాల మేరకు మోసాలకు పాల్పడుతుంది బీహార్ గ్యాంగ్‌గా గుర్తించి ఫారెన్ పాస్ పోర్ట్‌తో బీహార్ పోలీసులను కలిసి వారి సహకారం తీసుకున్నారు పోలీసులు. అక్కడ నుండి నిందితులు నిర్వహిస్తున్న కేంద్రం పై దాడులు జరిపారు పోలీసులు.
పోలీసుల దాడిలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక పెద్ద కాల్ సెంటర్, పదుల సంఖ్యలో ఎంప్లాయిస్, కంప్యూటర్స్ పెద్ద హంగామే ఉంది. వెంటనే మోసాలకు పాల్పడుతున్న చందన, రాహుల్‌లను అరెస్ట్ చేశారు. వారివద్ద నుండి 7,79,000 నగదు, సెల్ ఫోన్లు, ఏటీఎంలు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వారిలో పలు రాష్ర్టాలకు చెందిన అమాయక యువకులు ఉద్యోగాలు చేస్తున్నారు.
ఆయా రాష్ట్రాల నుండి అక్కడి భాష పై పట్టున్నవారిని ఉద్యోగులుగా తీసుకుంటారు ఈ ఘరానా మోసగాళ్ళు. ఇక్కడ ఉద్యోగులకు బ్యాంక్ ల పేరుతో మోసం చేస్తున్న సంస్థలో పనిచేస్తున్నామని కూడా తెలియదు. వారిలో ఉత్తరాంధ్ర నుండి వెళ్లిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి కొందరిని తీసుకువచ్చారు పోలీసులు. అయితే ఇలాంటి వినూత్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి: Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..