Cyber Crime: ఒక్క ఫోన్ కాల్‌‌తో నిండా ముంచేశారు.. కొరియర్ పేరుతో కోట్లు స్వాహా..!

| Edited By: Balaraju Goud

Jan 26, 2024 | 4:49 PM

కొరియర్ సంస్థల పేర్లు వాడుకుని అనేక రకాలుగా సైబర్ నేరానికి పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. మనం ఎలాంటి వస్తువులు ఆర్డర్ పెట్టక పోయినా సరే మీకు కొరియర్ వచ్చిందని కాల్స్ చేసి మనల్ని మభ్యపెట్టి, మన చేతి నుండే వారి అకౌంట్లోకి డబ్బులు పంపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై తస్మాత్ జాగ్రత్త !

Cyber Crime: ఒక్క ఫోన్ కాల్‌‌తో నిండా ముంచేశారు.. కొరియర్ పేరుతో కోట్లు స్వాహా..!
Cyber Crime
Follow us on

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల వ్యూహాలకు అంతులేకుండా పోయింది. ఎక్కడ ఏది ట్రెండింగ్‌లో ఉంటే దాన్ని అవలంభించుకుని ఈజీగా జనాల జేబులకు చిల్లు పెట్టేస్తున్నారు. తాజాగా కొరియర్ సంస్థల పేర్లు వాడుకుని అనేక రకాలుగా సైబర్ నేరానికి పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్నారు. మనం ఎలాంటి వస్తువులు ఆర్డర్ పెట్టక పోయినా సరే మీకు కొరియర్ వచ్చిందని కాల్స్ చేసి మనల్ని మభ్యపెట్టి, మన చేతి నుండే వారి అకౌంట్లోకి డబ్బులు పంపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై తస్మాత్ జాగ్రత్త !

పలు కొరియర్ సంస్థల పేర్లతో జరుగుతున్న సైబర్ నేరాలపై అటు కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఇటీవల కాలంలో వరుసగా FedEx కొరియర్ నుండి పార్సిల్ వచ్చిందని ప్రారంభమయ్యే ఫోన్ కాల్, చివరికి ముంబై పోలీస్ ఆఫీసర్ అంటూ ఎండ్ అవుతుంది. ఇలాంటి నేరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కొరియర్ పేరుతో వస్తున్న పార్సిల్‌లో తమ పేరుమీద కొన్ని మత్తు పదార్థాలు వచ్చాయని మనల్ని నమ్మిస్తారు. మనం భయపడేలోపే ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి ఫోన్ చేస్తున్నామని మరో కాల్ చేస్తారు. కట్ చేస్తే, ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని తాము కాపాడే ప్రయత్నం చేస్తామని డబ్బులు మొత్తం అకౌంట్‌కు జమ చేస్తే తమ ఈ కేసు నుండి పాక్షికంగా బయటపడినట్టేనని నమ్మించి మన అకౌంట్ లోని డబ్బులు మొత్తం స్వాహా చేసేస్తున్నారు.

దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇలాంటి కేసులు ఒక నెలకు 50 చొప్పున వెలుగులోకి వచ్చాయి. అయితే చాలా కేసుల్లో బాధితులు ఎక్కువగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. తెలంగాణలోని వీటి బారిన పడిన బాధితులు అనేకమంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో కొరియర్ సంస్థ పేరు చెప్పి అమాయకులను మోసం చేసిన 64 మందిపైన కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక తాజాగా 2023లో ఆ సంఖ్య 500% పెరిగింది. 2023లో 645 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు అంటే 25 రోజుల వ్యవధిలోనే 64 కేసులు నమోదయ్యాయి.. ఇతర కేసుల్లో ఇప్పటివరకు బాధితుల నుండి నేరగాళ్లు కాజేసిన సొమ్ము అక్షరాల 18.24 కోట్ల రూపాయలు.

అయితే ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాల్సిందిగా అధికారులు తెలుపుతున్నారు. మన అకౌంట్లో నుండి డబ్బులు పోయిన గంట వ్యవధిలోనే పోలీసులను ఆశ్రయిస్తే, రికవరీ శాతం పెరిగే ఆస్కారాలు ఉంది. అలా కాకుండా మనం నేరగాళ్లకు భయపడి పోలీసులను ఆశ్రయించకుండా ఉంటే, ఎట్టి పరిస్థితిలోనూ మనం పోగొట్టుకున్న మన డబ్బు తిరిగి రాదు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు వేటలో ఉన్నారు.. ప్రస్తుతానికి వారి ఖాతాలో ఉన్న నగదును ఫ్రీజ్ చేయించే పనిలో పడ్డారు. రానున్న రోజుల్లో ఇలాంటి నిరాలకు పాల్పడుతున్న వారిని కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే:

* ఎట్టి పరిస్థితుల్లో స్పామ్ నంబర్ల నుంచి కాల్స్ ఆన్సర్ చేయకండి.

* కొరియర్ సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నాం అనగానే అలెర్ట్‌గా ఉండండి.

* వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.

* ఎలాంటి పరిస్థితిలోనూ మీ బ్యాంక్ వివరాలు ఎవరికి ఇవ్వకండి.

* పోలీసులం అని చెప్పి కాల్స్ చేసినా సరే.. మీ బ్యాంక్ ఖాతాల గురించి ఎలాంటి వివరాలు ఇవ్వకండి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..