Kathi Mahesh: కత్తి మహేష్ మృతి కేసులో మరో ట్విస్ట్.. టీవీ9తో ఆసక్తికర విషయాలు చెప్పిన కత్తి మహేష్ కారు డ్రైవర్

|

Jul 14, 2021 | 5:58 PM

చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కత్తి మహేష్‌ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kathi Mahesh: కత్తి మహేష్ మృతి కేసులో మరో ట్విస్ట్.. టీవీ9తో ఆసక్తికర విషయాలు చెప్పిన కత్తి మహేష్ కారు డ్రైవర్
Kathi Mahesh Death Mystery
Follow us on

Kathi Mahesh Car Driver Suresh Shocking Comments: చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కత్తి మహేష్‌ మృతిపై తమకు అనుమానాలున్నాయని ఆయన తండ్రి ఓబులేషు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ చనిపోయిన విషయాన్ని తమకు చెప్పకుండానే బయటకు వెల్లడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదన్న ఓబులేషు.. ఇప్పుడు న్యాయం కోసం పోరాడే పరిస్థితి లేదన్నారు.

ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు. కత్తి మహేష్ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ముందుకు ఆయనతో ప్రయాణించిన కారు డ్రైవర్‌ సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. అయితే, డ్రైవర్ తాను సీట్‌బెల్ట్ ధరించానని, కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోలేదని వెల్లడించినట్టు తెలిసింది. కొన్ని గంటల పాటు సురేష్‌ను విచారించిన పోలీసులు వదిలివేశారు.

అనంతరం టీవీ9తో కత్తి మహేష్ కారు నడిపిన సురేష్ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి పోలీసులు వివరాలు అడిగారని తెలిపిన సురేష్.. మీకు ఎందుకు గాయాలు కాలేదని ప్రశ్నించారు. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల గాయాలు కాలేదని చెప్పానన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాద సమయంలో కత్తి మహేష్ నిద్రలో ఉన్నారు.. ఆ టైంలో ఎయిర్ బ్యాగ్ కూడా తెరుచుకుంది. బెల్ట్ వెనక నుంచి పెట్టుకున్న కారణంగా కత్తి మహేష్ ముందుకు పడ్డారు. దీంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అంతే తప్ప, ఇందులో తనను అనుమానించడానికి ఏమీ లేదని సురేష్ తెలిపారు. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని, వెంటనే స్పందించిన హైవే పెట్రోల్ సాయంతో ఆస్పత్రికి తరలించానని సురేష్ తెలిపారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను.. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని వెల్లడించారు.

ఇదే విషయానికి సంబంధించి టీవీ9 బృందం కోవూరు సిఐ రామ కృష్ణారెడ్డిని సంప్రదించింది. దీంతో ఆయన కత్తి మహేష్ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కారు నడిపిన సురేష్ ని పిలిపించాం, ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు ఆడిగి ప్రాథమిక వివరాలను తెలుసుకున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి మరి కొంత మందిని కూడా విచారించాల్సి ఉందన్నారు.

ఇదిలావుంటే.. కత్తి మహేష్ రెండు వారాల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే, కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు అయినప్పటికీ, అతని డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. దీంతో దళిత నాయకుడు మంద కృష్ణ కూడా ఈ సందేహాలను లేవనెత్తుతూ మహేష్ మరణం వెనుక కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అంతేకాకుండా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ కూడా చేయాలని డిమాండ్ చేశారు.

మంద కృష్ణతో పాటు, కత్తి మహేష్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ మరణం గురించి ఆసుపత్రి ముందుగా తమకు తెలియాలని, కానీ వారు అలా చేయకుండా నేరుగా వార్తలను మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాగా, మంద కృష్ణ చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై పోలీసు విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగింది?, కత్తి మహేష్‌కు మాత్రమే ఎందుకు తీవ్ర గాయాలు అయ్యాయి? అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించారు. మరి రానురాను ఈ సమస్య ఏ మలుపు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also.. AP Covid Cases: ఏపీలో తగ్గని కరోనా వైరస్ ప్రభావం.. మళ్లీ పెరిగిన కేసులు.. జాగ్రత్తగా ఉండాలంటూ అధికారుల వార్నింగ్..