Chhattisgarh Naxal Encounter: ఛత్తీస్‌గడ్‌లో అటవీ ప్రాంతం మరోసారి నెత్తురోడింది. రాష్ట్రంలోని బీజాపూర్‌లోని గల్గాం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఉదయం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సాయుధ నక్సలైట్లు ఉన్నారన్న సమాచారంతో.. కేంద్ర బలగాలు ఉసూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూంబింగ్ చేపట్టాయి. బలగాలను గమనించిన మావోలు వారిపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ప్రతిగా కాల్పులు జరిపారు. దాదాపు మధ్యాహ్నం వరకూ భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే.. నక్సలైట్ల కాల్పుల్లో ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్, సాధారణ పౌరుడు గాయపడ్డట్లు బీజాపూర్ ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ వెల్లడించారు.
మావోల మృతదేహాలను ఇంకా వెలికి తీయాల్సి ఉందని తెలిపారు. ఇంకా కూంబింగ్ జరుగుతోందని.. మావోలు ఈ ప్రాంతంలోనే ఇంకా ఉన్నట్లు అనుమానాలున్నాయన్నారు. నక్సలైట్లపై పక్కా సమాచారం వచ్చిందని దీంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. బలగాల రాకను గమనించి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతుందని తెలిపారు. తప్పించుకొని పారిపోయిన వారికి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ వివరించారు.
Also Read: