చిత్తూరు జిల్లాలో బంగారం పేరుతో అమాయకులను మోసం చేసింది ఓ ముఠా. 10 లక్షలకే కిలో బంగారం ఇస్తామని నమ్మించిన ముఠా ఇద్దరు యువకుల నుంచి 15లక్షల నగదు వసూలు చేసి పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు కేటుగాళ్లను అదుపులోకి తీసుకుని కూపీ లాగే పనిలోపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మండలం తుంబకుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తుంబకుప్పం గ్రామానికి చెందిన చక్రపాణి, మస్తాన్ అనే ఇద్దరు స్నేహితులకు మాయ మాటలు చెప్పి తమకు 3 కేజీల బంగారం దొరికిందని నమ్మించింది ఓ ముఠా. చిత్తూరు, పలమనేరు జాతీయ రహదారిలోని మొగిలిఘాట్ రోడ్డుకు చక్రపాణిని రమ్మని చెప్పి అక్కడ ఒరిజినల్ బంగారాన్ని చూపి నమ్మించింది ముఠా. తీరా బంగారం కొనటానికి వెళ్లగా, వీరి వద్ద 15 లక్షలు తీసుకుని నకిలీ బంగారం అప్పగించి దొంగల ముఠా అక్కడ్నుంచి పరారైంది.
అది అసలు బంగారం కాదు. గిల్టు అని తెలిసిన ఆ ఇద్దరు స్నేహితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు మదనపల్లికి చెందిన ఆసిఫ్, కుమార్ , రాజా అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి 7 లక్షల నగదు రికవరీ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. లోతైన దర్యాప్తు కొనసాగుతుంది.
Also Read: సర్వ గుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు