Black Magic at Godavari district: తూర్పు మన్యంలో దారుణం జరిగింది. మూఢనమ్మకాలు గిరిజనుల ప్రాణాలు తీసింది. వైద్య సాంకేతికత పెరిగినా ఏజెన్సీలో చేతబడి హత్యలు ఆగడం లేదు. ఏటపాక మండలం అయ్యవారిపేటలో చేతబడి చేశారనే నెపంతో సొంత బాబాయిని హతమార్చారు ఇద్దరు వ్యక్తులు. ఈనెల ఐదో తేదీన జరిగిన ఈ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తూర్పుగోదావరిజిల్లా ఏటపాక మండలం అయ్యవారిపేటలో ఈనెల ఐదో తేదీన చేతబడి నెపంతో దారుణ హత్య జరిగింది. అయ్యవారిపేటకు చెందిన వేల్పుల సత్యనారాయణకు పుట్టిన ముగ్గురు సంతానం చనిపోవడంతో అనుమానం ఎక్కువైంది.
సత్యనారాయణ అన్నయ్యకు కూడా సంతానం లేదు. వీళ్లిద్దరికి సంతానం లేకపోవడానికి కారణం వారి బాబాయ్ వేల్పుల రత్తయ్యే కారణమని భావించారు. సత్యనారాయణ, ప్రసాద్‌లు ఇద్దరూ కలిసి సొంత బాబాయ్‌ని హతమార్చాలని ప్లాన్ వేశారు. ఈ నెల ఐదో తేదీన గ్రామానికి సమీపంలో ఉన్న జామాయిల్ తోటలోకి రత్తయ్యను తీసుకెళ్లారు.
ముగ్గురు కలిసి అక్కడే ఫుల్‌గా మద్యం సేవించారు. తాగిన మత్తులో ఉన్న రత్తయ్యను ..ఇద్దరు అన్నదమ్ములు కలిసి కత్తితో నరికి చంపేశారు. చీకటి పడ్డ తర్వాత మరో ముగ్గురితో కలిసి మృతదేహాన్ని పక్కనే ఉన్న గోదావరినది ఇసుకలో పాతిపెట్టారు.
కుటుంబసభ్యులు రత్తయ్య కోసం అంతా గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అనుమానం ఉన్న కొందర్ని విచారించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
చివరకు సత్యనారాయణ, ప్రసాద్‌లను విచారించడంతో అసలు విషయం బయటపడింది. బాబాయ్ చేతబడి చేశారనే నెపంతోనే చంపినట్టు నిందితులు ఒప్పుకున్నారు. గోదావరినదిలో డెడ్‌బాడీని పాతిపెట్టినట్లు చెప్పారు. దాంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీసి..పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇద్దరు హంతకులతోపాటు వారికి సహకరించిన మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.