Dead man’s ATM card: బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కరోనాతో మృత్యువాతపడిన ఓ వ్యక్తి ఏటీఎం కార్డులో నుంచి.. ప్రభుత్వ ఉద్యోగులు భారీ మొత్తంలో మాయం చేశారు. ఆ గుమాస్తాకు అంత్యక్రియలు నిర్వహించిన డెహ్రీ మునిసిపాలిటీ ఉద్యోగులు మృతుని ఏటీఎం కార్డు చోరీ చేసి, ఆ ఖాతా నుంచి లక్షకు పైగా నగదును దోచుకున్నారని పోలీసులు వెల్లడించారు. మృతుని భార్య ఇదంతా గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. రోహ్తాస్ జిల్లాలోని ఓ స్కూల్‌లో గుమాస్తాగా పనిచేస్తున్న అభిమన్యు కుమార్ కరోనా బారినపడి డెహ్రీ ఆసుపత్రిలో చేరాడు. అనంతరం చికిత్స పొందుతూ ఏప్రిల్ 30 న మృతి చెందాడు.
అనంతరం ఆ మృతదేహాన్ని డెహ్రీ మునిసిపల్ కౌన్సిల్ ఉద్యోగులు కోవిడ్ నిబంధనల ప్రకారం దహనం చేశారు. అయితే.. భర్త మరణించిన తరువాత అభిమన్యు ఖాతా నుంచి రూ.1,06,500 ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసినట్లు మృతుని భార్య ఛాయా దేవి గుర్తించింది. ఆమె వెంటనే దరిహాట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా దీనిపై ఎస్పీ ఆశిష్ భారతి ఈ కేసు పరిష్కారానికి డెహ్రీ ఎస్‌డీపీవో సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో ముందుగా శ్మశానవాటిక నిర్వాహక సభ్యుడు విశాల్ డోమ్‌ను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అయితే.. ఆ ఏటీఎం కార్డును దొంగిలించి తామె డబ్బును తీసుకున్నామని విశాల్ ఒప్పుకున్నాడు. ఈ ఉదంతంలో తనకు సహకరించినవారి పేర్లను కూడా ఆయన పోలీసులకు వెల్లడించాడు. దీంతో వారిని అరెస్టు చేసి, డబ్బును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్పీ భారతి వెల్లడించారు.
Also Read: