భద్రాచలం వృద్ధురాలి హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నాలుగు నెలల తర్వాత వెలుగు చూసిన అసలు నిజం..!
నవమాసాలు మోసి కని పెంచిన.. కన్న కొడుకు ఆమె పాలిట కాలయముడయ్యాడు.. డబ్బు కోసం కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు.
police chased murder case: నవమాసాలు మోసి కని పెంచిన.. కన్న కొడుకు ఆమె పాలిట కాలయముడయ్యాడు.. డబ్బు కోసం కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. వృద్ధాప్యంలో తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకు డబ్బు కోసం కిరాతకంగా తల్లిని హతమార్చాడు. తల్లికి వచ్చిన ఆస్తి వాటాలో రూ. 9 లక్షలు అప్పుగా తీసుకుని, తిరిగి చెల్లించమని అడగడంతో కక్ష పెంచుకున్న కొడుకు అదును చూసి కాటికి పంపించాడు. నాలుగు నెలల పాటు శ్రమించిన ఖమ్మం జిల్లా పోలీసులు హత్య మిస్టరీని ఛేదించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లోని ఓంకార్ ఫ్రూట్స్ దుకాణంపైన తన సొంత ఇంటిలో ఒంటరిగా ఉంటున్న ఎర్రంశెట్టి బసవ పార్వతమ్మ (70) డిసెంబర్ 23 వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తెల్లవారిన తర్వాత డిసెంబర్ 24 వ తేదీ ఉదయం మృతురాలి కుమారులు ఇద్దరూ తల్లి మరణవార్త తెలుసుకుని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేసి మర్డర్ మిస్టరీ ని ఛేదించారు. మృతురాలి కొడుకు శ్రీనివాస్ నిందితుడు అని తేల్చారు.
మృతురాలి రెండవ కొడుకు యర్రంశెట్టి శ్రీనివాస్ బీపీఎల్‌లో జామయిల్ కర్ర వ్యాపారం చేస్తూ వాటిలో నష్టం రాగా, తన తల్లి దగ్గర రూ. 9లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 3 నెలలపాటు వడ్డీ చెల్లించిన శ్రీనివాస్ తరువాత నుండి వడ్డీ కూడా ఇవ్వకపోవడంతో తల్లి కొడుకు శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ముందు నిలదీసింది. దీంతో తల్లి పై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ తల్లిని చంపాలని నిర్ణయించుకుని ముందుగా విషప్రయోగం చేయాలని ప్రయత్నించాడు. అయితే, అది కుదరకపోవడంతో డిసెంబర్ 23 వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు తన తల్లి ఒంటరిగా ఉంటున్న ఓంకార్ ఫ్రూట్స్ దుకాణం పైన ఉన్న ఆమె ఇంటికి వెళ్లాడు. తల్లి కొడుకును చూసి తలుపు తీసి లోపలికి రమ్మని చెప్పి కూర్చోబోతుండగా శ్రీనివాస్ ఆమె గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు.
తల్లి మృతి చెందింది అని నిర్ధారించుకున్నాక, ఆమె చెవి దిద్దులు, బంగారు అభరణాలు, బీరువాలో ఉన్న రూ. 9 లక్షల ఫ్రా0శరీ నోటు తీసుకుని అక్కడి నుండి ఏమీ ఎరుగనట్లు తన ఇంటికి వెళ్లిపోయాడు. డిసెంబర్ 24వ తేదీ రాత్రి 9.30 గంటలకు తల్లి మరణించిందని కుటుంబ సభ్యులతో పాటు ఏమీ ఎరుగనట్లు తల్లి ఇంటి వద్దకు వెళ్లాడు. మృతురాలి పెద్ద కొడుకు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. అనుమానస్పదం మృతిలా ఉంది అని కేసు పెడదామంటే, తల్లికి బీపీ,షుగర్ ఎక్కువై చనిపోయి ఉంటుందని కుటుంబసభ్యులతో నిందితుడు శ్రీనివాస్ నమ్మబలికాడు. కాగా ఎట్టకేలకు పెద్ద కొడుకు ఇతర బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, పోస్ట్‌మార్టం చేయకుండా మృతదేహాన్ని ఇవ్వాలని డాక్టర్ పై కూడా శ్రీనివాస్ ఒత్తిడి తెచ్చాడని పోలీసులు తెలిపారు.
చివరకు పోలీసులు మర్డర్ మిస్టరీని చాకచక్యంగా ఛేదించి మృతురాలి 2వ కొడుకు శ్రీనివాస్ హంతకుడు అని నిర్ధారించుకుని ఈ ఉదయం అతనిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసుల విచారణ లో శ్రీనివాస్ తన తల్లిని డబ్బు కోసమే హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించినట్లు పట్టణ సీఐ స్వామి మీడియాకు వివరించారు. నిందితుని వద్ద నుండి తన తల్లి బంగారు అభరణాలు, ఒక స్కూటీ ని స్వాధీనం చేసుకున్నారు.
Read Also… Tamil New Year 2021: సంప్రదాయపు దుస్తుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కీర్తి సురేష్..