Caste Deportation in Jagityal: సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతుంటే.. ఇంకా పల్లెల్లో కుల గజ్జీ వదలడంలేదు. తాజాగా జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కుల బహిష్కరణ పేరుతో దుండగులు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై పడి బీభత్సం సృష్టించారు. చంపుతామని బెదిరించడమే కాదు.. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
జగిత్యాల రూరల్ మండలంలోని మోతే గ్రామంలో బావాజీ పల్లెలో జరిగింది ఈ ఘటన. భూ పంచాయతీ విషయంలో కొండపల్లి నీలయ్య కుటుంబాన్ని గ్రామంలోని కులస్థులు ఆంక్షలు విధించారు. ఆ కుటుంబసభ్యులను ఎవరిని ఎటువంటి కార్యక్రమాలకు పిలవ్వద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బహిష్కరణపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ.. కులపెద్దలు రెచ్చిపోయారు. నీలయ్య ఇంట్లో లేని సమయంలో మిగిలిని కుటుంబసభ్యులపై దాడికి దిగారు. ఇంట్లో టీవీ, ఫర్నీచర్, ఫ్రిడ్జ్‌తో పాటు ఇంట్లోని వస్తువులు, టూ వీలర్, సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మొత్తం 15 మంది వరకు వచ్చి తమ ఇంటిపై దాడికి దిగారని బాధితులు తెలిపారు.
ఈ ఘటనపై నీలయ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బవాజీపల్లెకు చెందిన వీరయ్య, గంగారావు, సంపత్, రవి, మస్తాన్ అనే ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also…..