Gang Clash In Prison: జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య వంద దాటింది. ఈక్వెడార్ దేశంలోని గ్వయాస్ ప్రావిన్స్‌లోని పెనిటెన్షియారియా డెల్ లిటోరల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటివరకు 116 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. సోమవారం జైలులోని రెండు గ్యాంగుల మధ్య చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారినట్లు ఈక్వేడార్ అధికారులు తెలిపారు. అనంతరం రెండు వర్గాల ఖైదీలు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో మొదట 24 మంది ఖైదీలు మృతిచెందినట్లు పేర్కొనగా.. రెండు రోజుల నుంచి మరణాల సంఖ్య పెరగుతూ వస్తోంది. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు.
మెక్సికన్ డ్రగ్స్ ముఠాల వల్ల ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని జైలు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఆరుగురిని శిరచ్ఛేదం చేశారని నేషనల్ ఈక్వేడార్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది. జైలులో అల్లర్లను నియంత్రించేందుకు వచ్చిన పోలీసుల్లో ఇద్దరు గాయపడ్డారని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పేర్కొంది. ఈ అల్లర్లలో దాదాపు 50మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఈక్వెడార్ జైళ్లల్లో తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షనల్లో 79 మంది మరణించారు. దీంతోపాటు జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు. ఈ ఘటనలపై ఇంటర్-అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఖండించింది. జైలు హింసపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులను శిక్షించాలని ఈక్వెడార్ ప్రభుత్వాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ కోరింది.
Also Read: