Assam Covid deaths: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఈ సంఘటన గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో చోటు చేసుకుంది. రాత్రివేళ విధుల్లో ఉండాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే.. మరణాలు సంభవించాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన 12 మందిలో ఐసీయూలో ఉన్న తొమ్మిది మంది, వార్డులో ఉన్న ముగ్గురు రోగుల్లో ఆక్సిజన్ స్థాయిలు 90 శాతం కన్నా తక్కువగా ఉన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అభిజిత్ శర్మ పేర్కొన్నారు. ఐసీయూలో ఉన్న రోగులకు కోమోర్బిడిటీస్ ఉన్నాయని, ఆక్సిజన్ స్థాయి అవసరమైన దానికంటే తక్కువగా ఉందన్నారు. ఆ రోగులంతా పరిస్థితి విషమించిన అనంతరమే ఆసుపత్రికి వచ్చారని డాక్టర్ శర్మ వివరించారు.
వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదని.. దీంతో వారు చనిపోయారన్నారు. మృతుల్లో ఎవరూ ఒక్క మోతాదు వ్యాక్సిన్ తీసుకోలేదని పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారు.. తమ ఆరోగ్యం దృష్ట్యా సాధ్యమైనంత తర్వగా ఆసుపత్రి, కోవిడ్ కేర్ సెంటర్‌లో చేరాలని కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సుమారు 200 మంది వరకు ఉన్నారని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి మహంత ఆసుపత్రిని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.