AP Road Accident: ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొండపల్లి మండలం చామలపల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదవశాత్తు అదుపుతప్పి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఈ ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గజపతినగరం పీహెచ్‌సీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని విశాఖపట్నం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు మెంటాడ మండలం చింతాడవలస వాసులుగా గుర్తించారు. రాచకిండాంలో వివాహానికి హాజరై ట్రాక్టర్‌లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 35 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో..
ఇదిలాఉంటే.. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు వాగులో గల్లంతయ్యారు. సంగం బిరా పేరు వాగు వద్ద ఆటోను లారీ ఢీ కొట్టింది. లారీ ఢీకొట్టడంతో ఆటో వాగులో పడింది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణికులు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో ఆరుగురిని క్షేమంగా రక్షించారు. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల నాగవళ్లి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను స్వయంగా ఎస్పీ విజయరావు పర్యవేక్షించారు. రెస్క్యూ చర్యలను వేగవంతంగా కొనసాగించాలని పలువురు మంత్రులు అధికారులను ఆదేశాలిచ్చారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ ఆదేశాలిచ్చారు.
Also Read: