Telugu Academy Deposits Case: తెలుగు అకాడమీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తవ్వేకొద్దీ.. కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ము కోట్ల రూపాయలు కాజేసిన అవినీతిపరుల నుండి.. దోచుకున్న సొత్తును కక్కిస్తున్నారు అధికారులు. ఈ డిపాజిట్ల కేసులో మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కృష్ణారెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణారెడ్డి సాయికుమార్‌తో కలిసి డిపాజిట్ల గోల్ మాల్ కేసులో కీలక పాత్ర పోషించారు. పొద్దుటూరు చెందిన కృష్ణారెడ్డి.. కూకట్ పల్లిలోని నిజాంపేట్‌లో నివాజం ఉంటున్నాడు. తెలుగు అకాడమీ డిపాజిట్లలో తన వాటాగా కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రాగా, పోలీసుల విచారణలో మాత్రం 3.5 కోట్లు తీసుకున్నట్లు కృష్ణారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ వేర్ హౌసింగ్ లో 10కోట్లు, ఏపీ సీడ్స్ కార్పోరేషన్ 5కోట్లు గోల్ మాల్‌లోనూ కృష్ణారెడ్డి కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్‌ల గోల్ మాల్‌లో ఏపీలో కృష్ణారెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో ఈ రోజుతో 8 మంది నిందితుల కస్టడీ ముగిసింది. అయితే వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చి చంచల్ గూడ జైలుకు తరలింపు
అయితే ప్రజా ధనాన్ని దోచుకున్న డబ్బు.. ఏ విధంగా దాచుకున్నారు.. ఎక్కడ దాచారు. ఎందులో పెట్టుబడులు పెట్టారనే అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వెంకట్ సాయికుమార్ 35 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. మరో నిందితుడు వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సత్తుపల్లిలో ఓ భారీ బిల్డింగ్ కొనుగోలు చేసినట్లుగా తేల్చారు. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్లు మస్తాన్ వలీ, సాధన కూడా దోచుకున్న డబ్బుతోనే ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు ఈడీ అధికారులు. తెలుగు అకాడమీ డిపాజిట్లతో ఆర్థిక మోసాలకు పాల్పడిన నిందితుల ఆస్తులను గుర్తించిన ఈడీ అధికారులు వాటిని జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.