యువత తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ మానవ సంబంధాలను మంటకలిపేస్తున్నారు. ప్రేమ అనే పేరుతో చెడు తిరుగుళ్ళు తిరుగుతూ అడ్డంగా కన్న తల్లి వచ్చినా.. వారిని కర్కశంగా హతమారుస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్ శివార్లలో కీర్తి రెడ్డి ఎపిసోడ్ మరవకుముందే.. మరో కఠినాత్మురాలు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిని ఆస్తి కోసం అతి క్రూరంగా కాటికి చేర్చింది. ఈ విషాద సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది.
తల్లి చనిపోతే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని భావించిన భార్గవి అనే మహిళ.. తన భర్త, బాయ్‌ఫ్రెండ్ సహాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. గుంటూరులోని మూడు బొమ్మల సెంటర్‌లో ఈ నెల 10వ తేదీని ఆలపాటి లక్ష్మీ.. తను ఉంటున్న అద్దె ఇంట్లో హత్యకు గురైంది. ఇక ఈ సంఘటనపై పక్కింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. అయితే ఈలోపు భార్గవి వారికి అడ్డు తగిలి.. తమకు ఎవరూ శత్రువులు లేరని.. కేసు వద్దని పోలీసులతో వారించింది. ఇక పోలీసులు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఈ విషయంపై సైలెంట్ అయ్యారు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో స్పష్టం ఇది హత్య అని తేలింది. దానితో పోలీసులకు భార్గవిపై అనుమానం కలిగింది. అంటే తమదైన శైలిలో వాళ్ళు విచారణ ప్రారంభించడంతో అసలు వాస్తవాలు బయటికి వచ్చాయి. ఆలపాటి లక్ష్మీ కాళ్ళను కుమార్తె భార్గవి పట్టుకోగా, అల్లుడు, ఆమె బాయ్‌ఫ్రెండ్ కలిసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు భార్గవి అంగీకరించిందని పోలీసులు స్పష్టం చేశారు.
తల్లి ఆస్తిపై కూతురు భార్గవి ముందు నుంచి ఓ కన్నేసిందని తెలిపారు. తండ్రి ఇటీవలే మరణించడంతో.. భార్గవి పలుమార్లు తల్లితో ఆస్తి విషయంలో గొడవలు పడుతూ ఉండేదని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. కూతురు భార్గవి పేరిట తల్లి ఆస్తి రాసేందుకు అంగీకరించకపోవడంతో తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాలని పక్కా స్కెచ్ వేసి మరీ ఈ నెల 10న భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కిరాతకంగా హత్య చేసిందన్నారు.