ఎంత తెలివైనా క్రిమినల్ అయినా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఆ చిన్న తప్పే వాడిని పట్టిస్తుంది. ఒక్కోసారి నేరస్థులు చేసే చిన్నచిన్న మిస్టేట్స్‌తోనే పెద్దపెద్ద కుంభకోణాలూ బయటపడతాయ్. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటిదే ఒకటి జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎంతో తెలివిగా వేల ఎకరాల భూమిని కాజేసిన కేటుగాడు ఒకే ఒక్క చిన్న మిస్టేట్‌తో దొరికిపోయాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన భూకుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా రెండు వేలకు పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంతో చాకచక్యంగా కొట్టేశారు. ఈ ల్యాండ్ స్కామ్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఒక కామన్‌మేన్. ఈ కేటుగాడికి సహకరించింది కేవలం అతని కుటుంబ సభ్యులే.
13 మండలాలు… 18 గ్రామాలు… 93 సర్వే నెంబర్లు… 2320 ఎకరాలు… చిత్తూరు జిల్లాలో బయటపడిన ల్యాండ్ స్కామ్ మొత్తం 5వందల కోట్ల రూపాయిలు. ఈ భూములన్నీ ప్రభుత్వానివే. ఎవరికీ అనుమానం రాకుండా… అధికారులకు దొరక్కుండా చాలా తెలివిగా కొట్టేశాడు మోహన్ గణేష్ పిళ్లై.ఒక కామన్‌మేన్‌కి ఇది ఎలా సాధ్యమైంది. అసలెలా ప్రభుత్వ భూములను తన కుటుంబ సభ్యుల పేర రాయించుకోగలిగాడు? కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న గణేష్ పిళ్లై… వారసత్వంగా వచ్చిన గ్రామకరణంగా పనిచేసేవాడు. 1992లో వీఆర్వోగా పదోన్నతి పొంది 2010లో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాతే తన క్రిమినల్ ప్లాన్‌ను బయటికి తీశాడు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో ముందే తెలుసుకున్న పిళ్లై… నకిలీ పత్రాలతో ఆన్‌లైన్‌లో అగండళ్లు సృష్టించి తన తల్లి, కూతుళ్లు, కొడుకుల పేరిట రాయించుకున్నాడు.
ఏం చేసినా పక్కా ఆధారాలతో లీగల్‌గా ప్రభుత్వ భూములను కాజేస్తూ వచ్చిన పిళ్లై… ఒకే చిన్న మిస్టేట్‌తో దొరికిపోయాడు. సర్వే నెంబర్లు, భూమి లెక్కలు పక్కాగా చూసుకుని నకిలీ పత్రాలు సృష్టించే గణేష్ పిళ్లై… ఒకచోట లెక్క తప్పాడు. సోమల మండలం పెద్దఉప్పరపల్లిలోని సర్వే నెంబర్ 459లో 160.09 ఎకరాలకు నకిలీ పత్రాలతో పట్టాదారు పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నాడు. ఎంత తెలివైన క్రిమినలైనా ఎక్కడో ఒకచోట దొరికిపోతాన్నట్టుగా పిళ్లై ఇక్కడే దొరికిపోయాడు. ఆ సర్వే నెంబర్‌లో 45 ఎకరాలు ఉంటే 160 ఎకరాలకు దరఖాస్తు చేశాడు. లెక్కలు తేడా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే గణేష్ పిళ్లై బండారం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా మొత్తం 2320 ఎకరాల భూ కుంభకోణం బయటపడింది.
మొత్తం ఆరుగురిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ప్రధాన సూత్రధారి గణేష్ పిళ్లైతోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గణేష్ పిళ్లై కూతురు ధరణి కోసం గాలిస్తున్నారు. నిందితుల దగ్గర్నుంచి పెద్దఎత్తున నకిలీ డాక్యుమెంట్స్, సీళ్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి